
AP Govt: 93వేల కుటుంబాలకు లబ్ధి.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాజాగా చేనేత కార్మికులకు తీపి కబురు అందించారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 93 వేల చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున, పవర్ లూమ్‌లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజా నిర్ణయంతో 93,000 చేనేత కుటుంబాలతో పాటు 10,534 పవర్ లూమ్ యూనిట్లకు ప్రయోజనం కలుగనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Details
పవర్ లూమ్‌లకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటన
అయితే ఈ పథకం అమలు విధివిధానాలను ఖరారు చేయడానికి ప్రభుత్వం ఇంధన శాఖతో సంప్రదింపులు జరుపనుంది.
చేనేత వస్త్రాల తయారీని వృత్తిగా చేసుకుంటున్న కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడమే ఈ పథకానికి ముఖ్య ఉద్దేశం.
ముఖ్యంగా లబ్ధిదారులు అనుమతించిన విద్యుత్ పరిమితిని మించిపోతే, రాయితీ మొత్తం కోల్పోకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిబంధనను తీసుకువచ్చింది.
200 యూనిట్ల వరకు విద్యుత్ ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. అయితే అదనంగా వినియోగించిన యూనిట్లకు మాత్రం డిస్కంల టారిఫ్ ప్రకారం వినియోగదారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇదే నిబంధన పవర్ లూమ్‌లకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.