Page Loader
F-35B Jet: కేరళ ఎయిర్‌పోర్టులో నిలిచిన యుద్ధవిమానం.. యూకే నుంచి ప్రత్యేక బృందం హాజరు
కేరళ ఎయిర్‌పోర్టులో నిలిచిన యుద్ధవిమానం.. యూకే నుంచి ప్రత్యేక బృందం హాజరు

F-35B Jet: కేరళ ఎయిర్‌పోర్టులో నిలిచిన యుద్ధవిమానం.. యూకే నుంచి ప్రత్యేక బృందం హాజరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 06, 2025
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్‌ రాయల్‌ నేవీకి చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్‌-35బి (F-35B) తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోయిన ఘటనపై మరమ్మతు పనులు జోరుగా సాగుతున్నాయి. సాంకేతిక సమస్యలతో గత నెల 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత అత్యవసరంగా కేరళలో ల్యాండ్‌ చేసిన ఈ ఫైటర్‌ జెట్‌ ఇప్పటికీ అక్కడే ఉంది. విమానాన్ని మరమ్మతు చేసి లేదా ఎయిర్‌లిఫ్ట్‌ చేసి తరలించేందుకు యూకే సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ప్రత్యేక పరికరాలతో కూడిన ఏవియేషన్ ఇంజినీర్ల బృందం బ్రిటన్‌ నుంచి ఆదివారం రాయల్ ఎయిర్‌ఫోర్స్ A400M విమానంలో కేరళకు వచ్చింది. విమానాన్ని హ్యాంగర్‌కు తరలించి మరమ్మతులు ప్రారంభించారు.

Details

ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు

అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత విమానం తిరిగి సేవల కోసం సిద్ధమవుతుందని బ్రిటిష్ హైకమిషన్ వెల్లడించింది. ఇతర విమానాల షెడ్యూల్‌లకు ఎలాంటి అంతరాయం ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఫైటర్‌ జెట్‌కు CISF సాయుధ బలగాలు భద్రత కల్పిస్తున్నాయని, విమానాశ్రయంలో అదనపు జాగ్రత్తలు పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫైటర్‌ జెట్‌ రవాణా కోసం సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ వంటి భారీ కార్గో విమానం ఉపయోగించే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Details

సాంకేతిక లోపమే కారణం

గత నెల ఇండో-యూకే నేవీ సంయుక్త విన్యాసాల్లో పాల్గొన్న సమయంలో ఈ ఫైటర్‌ జెట్‌లో ఇంజినీరింగ్‌ లోపం తలెత్తింది. తొలుత వాతావరణ సమస్యల కారణంగా ల్యాండ్‌ చేశారని వార్తలు వచ్చినా, తరువాత స్పష్టత ఇచ్చిన యూకే అధికారులు ఇంధన సమస్య కాదని, ఫైటర్‌ జెట్‌లో సాంకేతిక లోపం ఉందని స్పష్టం చేశారు. విమానాన్ని రిపేర్‌ చేయడానికి మొదట AW101 మెర్లిన్‌ హెలికాఫ్టర్‌ ద్వారా నిపుణులు రావడంతో తాత్కాలికంగా కొన్ని పనులు జరిగినా, పూర్తిస్థాయి మరమ్మతుల కోసం తాజాగా భారీ బృందం రంగంలోకి దిగింది.