Earthquake: చైనాలో 7.2 తీవ్రతతో భూకంపం..ఢిల్లీలో ప్రకంపనలు
సోమవారం రాత్రి చైనాలోని దక్షిణ జిన్‌జియాంగ్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల వల్ల ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం 80 కిలో మీటర్ల లోతులో ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది. ఇక ప్రస్తుతం సంభవించిన భూకంపం కారణంగా కిర్గిజిస్తాన్-జిన్‌జియాంగ్ సరిహద్దు వెంబడి అనేక మంది గాయపడ్డగా, కొన్ని ఇళ్లు కూలిపోయాయని అధికారులు తెలిపారు. భూకంపం సంభవించిన వెంటనే జిన్‌జియాంగ్ రైల్వే శాఖ పరిధిలోని 27 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చైనా మీడియా ప్రకారం, చైనా వాయువ్య ప్రాంతంలోని భూకంప కేంద్రం వుషి కౌంటీకి సమీపంలో 3.0,అంతకంటే ఎక్కువ తీవ్రతతో 14 అనంతర ప్రకంపనలు నమోదయ్యాయి.
కజకిస్థాన్,ఉజ్బెకిస్థాన్ లో భూ ప్రకంపనలు
భూకంప కేంద్రానికి దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. చైనా అధికారులు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సేవలను సక్రియం చేశారు.అనేక విభాగాలు సహాయక చర్యలను సమన్వయం చేశాయి. కాటన్ టెంట్లు,కోట్లు,క్విల్ట్‌లు,దుప్పట్లు, మడత పడకలు, హీటింగ్ స్టవ్‌లను అందించాయని , చైనా మూలాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. కజకిస్థాన్‌లో, అదే భూకంపం 6.7 తీవ్రతతో సంభవించినట్లు అత్యవసర మంత్రిత్వ శాఖ నివేదించింది. కజకిస్థాన్‌లోని అతిపెద్ద నగరమైన అల్మాటీలో భూకంపం సంభవించడంతో ఇళ్లలోని వారంతా భయంతో బయటికి పరుగులు తీశారు. ఆ తర్వాత ప్రకంపనలు ఉజ్బెకిస్తాన్‌లో కూడా సంభవించాయి. కజకిస్థాన్,ఉజ్బెకిస్థాన్ లో వచ్చిన భూకంపం వల్ల ఇప్పటివరకు ఎటువంటి గాయాలు లేదా ఆస్తి నష్టం వంటివి వెలుగులోకి రాలేదు.