KUDA: వరంగల్ అభివృద్ధికి కొత్త దశ.. 'కూడా' ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 'కుడా' 2041 మాస్టర్‌ప్లాన్‌కి ఆమోదం లభించడంతో పాటు మామునూరు విమానాశ్రయ అభివృద్ధి కోసం రూ.205 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మాస్టర్‌ప్లాన్ పరిధిని వరంగల్, కాజీపేట, హనుమకొండతో పాటు సమీపంలోని 181 రెవెన్యూ గ్రామాలుగా నిర్ణయించారు. మొత్తం 1,805 చ.కి.మీ.లో భూ వినియోగానికి జోన్లను గుర్తించి, నిర్మాణ అనుమతుల కోసం ఏర్పడుతున్న అవాంతరాలను తొలగించడం ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ ప్రమాణాలతో పునరుద్ధరణ, బాహ్యవలయ రహదారులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యే అవకాశాలున్నాయి. మామునూరు విమానాశ్రయానికి అదనంగా అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం రూ.205 కోట్లు రిలీజ్ చేశారు.
696 ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం
విమానాశ్రయం అభివృద్ధి కోసం ఇప్పటికే 696 ఎకరాల భూమిని ప్రభుత్వం సమకూర్చగా, అదనంగా అవసరమైన భూమిని రైతుల నుంచి సేకరించారు. ఇక రన్‌వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ, నేవిగేషనల్ సౌకర్యాల నిర్మాణానికి ఇది దోహదం చేస్తుంది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇంటిగ్రేటెడ్ డివిజినల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరు చేశారు. ఈ కాంప్లెక్స్ రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. గ్రేటర్ వరంగల్ పరిపాలన టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.32.50 కోట్లు మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు పొడిగింపునకు అదనంగా రూ.80 కోట్ల వ్యయంతో 8.30 కి.మీ. రహదారి నిర్మాణం చేపట్టనుంది. కుడా మాస్టర్‌ప్లాన్ ఆమోదంతో వరంగల్ పట్టణాభివృద్ధి కొత్త దశకు చేరుకుంది.