Page Loader
ముంబై: హాస్టల్ గదిలో శవమై కనిపించిన విద్యార్థిని; రైలు పట్టాల వద్ద నిందితుడి మృతదేహం 
ముంబై: హాస్టల్ గదిలో శవమై కనిపించిన విద్యార్థిని; రైలు పట్టాల వద్ద నిందితుడి మృతదేహం

ముంబై: హాస్టల్ గదిలో శవమై కనిపించిన విద్యార్థిని; రైలు పట్టాల వద్ద నిందితుడి మృతదేహం 

వ్రాసిన వారు Stalin
Jun 07, 2023
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని హాస్టల్ గదిలో ఓ విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనుమానిస్తున్నామని, శవపరీక్ష నివేదిక వచ్చిన అది నిర్ధారణ అవుతుందని పోలీసులు తెలిపారు. మెరైన్ డ్రైవ్ ఏరియాలోని సావిత్రి ఫూలే మహిళా హాస్టల్‌ గదిలో 19ఏళ్ల కాలేజీ యువతి మృతదేహం కనిపించడంతో ముంబై పోలీసులు అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న ఓం ప్రకాష్ కనౌజియా అనే 30 ఏళ్ల యువకుడి మృతదేహం రైలు పట్టాలపై కనిపించడం గమనార్హం. ఓం ప్రకాష్ కనౌజియా సావిత్రి ఫూలే మహిళా హాస్టల్‌లో గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ హాస్టలోనే ఆ విద్యార్థిని ఉంటోంది. ఈ కేసుకు సంబంధించి మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ముంబై

మెడకు దుపట్టా చుట్టుకుని విగత జీవిగా పడి ఉన్న బాధితురాలు

మృతి చెందిన కళాశాల విద్యార్థినిపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలు సబర్బన్ బాంద్రాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతోంది. ఆమె స్వస్థలం మహారాష్ట్రలోని విదర్భగా గుర్తించారు. తొలుత విద్యార్థిని కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇదే సమయంలో నాలుగో అంతస్తులోని హాస్టల్ గదికి బయటి నుంచి తాళం వేసి ఉండటాన్ని పోలీసులు గమనించారు. గదిలోకి ప్రవేశించిన పోలీసు బృందం బాధితురాలు మెడకు దుపట్టా చుట్టుకుని విగత జీవిగా పడిఉన్నట్లుగా గుర్తించారు. హాస్టల్‌లో పనిచేస్తున్న ఓం ప్రకాష్ కనౌజియా ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో పోలీసులు అతని కోసం గాలించగా, మంగళవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో సమీపంలోని రైల్వే స్టేషన్‌లో శవమై కనిపించాడు.