
IIM Calcutta: ఐఐఎం కోల్‌కతా అత్యాచార కేసులో మలుపు.. బాధితురాలి తండ్రి సంచలన ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM-Calcutta)లో చదువుతున్న ఓ విద్యార్థినిపై జరిగిన లైంగికదాడి కేసు కీలక మలుపు తిరిగింది. తీవ్ర దుమారం రేపిన ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతుండగానే బాధితురాలి తండ్రి చేసిన ప్రకటన కొత్త చర్చకు దారితీసింది. తన కుమార్తెపై అసలు అత్యాచారమే జరగలేదని, పోలీసులు బలవంతంగా ఆమెను ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. తన కుమార్తె నుంచి రాత్రి 9.34 గంటల సమయంలో ఫోన్‌కాల్ వచ్చిందని, అయితే ఆమె తన స్థానం చెప్పలేదని తెలిపారు. "కారు నుంచి పడిపోయానని, కళ్లు తిరుగుతున్నాయని మాత్రమే చెప్పింది. ఆమె లొకేషన్ ట్రాక్ చేయగా ఆసుపత్రిలో ఉన్నట్టు తెలిసింది.
Details
బాధితురాలు మానసిక సమస్యతో బాధపడుతోంది
వెంటనే అక్కడికి వెళ్లి ఆమెను చూసాను. పోలీసులు ఆమెను రక్షించి ఆసుపత్రికి చేర్చినట్లు చెప్పారు. తర్వాత నేను ఆమెతో మాట్లాడగా.. అసలు విషయం బయటపడింది. ఎవరు వేధించలేదని, ఏ హానీ జరగలేదని తెలిపింది," అని బాధితురాలి తండ్రి మీడియాకు వెల్లడించారు. ముఖ్యంగా, పోలీసులు అత్యాచార ఆరోపణలు చేయమని తన కుమార్తెను బలవంతపెట్టినట్లు ఆయన ఆరోపించారు. తన కుమార్తె మానసికంగా నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై తొలుత వెలువడిన నివేదికల ప్రకారం.. బాధితురాలు మానసిక సమస్యలతో బాధపడుతోందని చెప్పిన తోటి విద్యార్థి, ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వాలంటూ బాయ్స్ హాస్టల్‌కు పిలిపించుకున్నాడని వార్తలు వచ్చాయి.
Details
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అక్కడ ఆమెకు ఇచ్చిన కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడని, అనంతరం బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసుల ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందిత విద్యార్థిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో బాధితురాలి తండ్రి చేసిన వ్యాఖ్యలు కేసులో కీలక మలుపునకు దారితీయనున్నాయి. ఇదే సమయంలో గతంలో కోల్‌కతాలో జరిగిన పలు లైంగికదాడి ఘటనలు ప్రజాస్వామ్యంలో పెద్ద దుమారాన్ని రేపిన నేపథ్యంలో తాజా ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు పిలుపులు వస్తున్నాయి. రాజకీయ వర్గాలు కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తున్నాయి. ఈ కేసు అసలు నిజాలు ఏమిటన్నది పోలీసుల దర్యాప్తుతో బయటపడాల్సి ఉంది.