కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్
పాట్నాలో కీలక ప్రతిపక్షాల సమావేశానికి ముందు ఆప్ కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీ చేసింది. దిల్లీ పరిపాలన హక్కుల విషయంలో కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే శుక్రవారం జరిగే ప్రతిపక్ష సమావేశానికి గైర్హాజరవుతామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ తమకు మద్దతివ్వాలని, లేని పక్షంలో విపక్షాల సమావేశాన్ని బహిష్కరిస్తామని, భవిష్యత్తులో జరిగే సమావేశాలకు దూరంగా ఉంటామని ఆప్ వర్గాలు వెల్లడించాయి. దిల్లీ బ్యూరోక్రాట్‌లను తమ ఆధీనంలోకి తీసుకుంటూ గత నెలలో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిందని ఆప్ వాదిస్తోంది.
ఆప్ అల్టిమేటం ప్రతిపక్ష ఐక్యతను దెబ్బతీస్తుందా?
పాట్నలో జరిగే ప్రతిపక్షాల సమావేశంలో ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేస్తుందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా వారి మద్దతును కూడగట్టడానికి, పార్లమెంటు ద్వారా చట్టంగా మారకుండా నిరోధించే ప్రయత్నంలో బీజేపీయేతర పార్టీల నాయకులతో కేజ్రీవాల్ సమావేశమవుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వస్తున్న సమయంలో ఆప్ ఈ మెలికి పెట్టడం, అపోజిషన్ పార్టీల ఐక్యతకు విఘాతం కలుగుతుందా? అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. బిహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్ పాట్నలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశం రాబోయే ఎన్నికల కోసం ప్రతిపక్షాల ఉమ్మడి వ్యూహాన్ని నిర్దేశిస్తుందని భావిస్తున్నారు.