Page Loader
AAP: ఇండియా కూటమి నుంచి ఆప్ బయటకు వచ్చేసిందన్న సంజయ్‌ సింగ్‌.. రేపటి కీలక సమావేశానికి కూడా..
AAP: ఇండియా కూటమి నుంచి ఆప్ బయటకు వచ్చేసిందన్న సంజయ్‌ సింగ్‌..

AAP: ఇండియా కూటమి నుంచి ఆప్ బయటకు వచ్చేసిందన్న సంజయ్‌ సింగ్‌.. రేపటి కీలక సమావేశానికి కూడా..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా కూటమిలో విభేదాలు చెలరేగాయి. ఇటీవల కాలంగా కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య అభిప్రాయ భేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమ్ ఆద్మీపార్టీ ఇండియా కూటమి నుంచి విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది. రేపు జరగబోయే ఇండియా కూటమి సమావేశానికి తాము హాజరు కానని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. ఆప్ పార్టీ ఇండియా కూటమి నుంచి వైదొలిగినట్లు ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ శుక్రవారం స్పష్టం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని తమ పార్టీ ఇకపై ఇండియా బ్లాక్‌లో భాగంగా ఉండబోదని వెల్లడించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందు జరగనున్న ప్రతిపక్ష పార్టీలు నిర్వహించే సమావేశానికి కూడా హాజరు కాబోమని స్పష్టం చేశారు.

వివరాలు 

మేము ఆ కూటమిలో భాగంగా ఉండము: సంజయ్ సింగ్

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఇండియా కూటమి భాగస్వామిగా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసినప్పటికీ, హరియాణా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తమ పార్టీ స్వతంత్రంగా పోటీ చేసిందని సంజయ్ సింగ్ వివరించారు. ఇండియా కూటమిని ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల కోసమే ఏర్పాటు చేశామని, అయితే అనంతర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసిందని ఆయన తెలిపారు. "ఇప్పటికే ఆప్ పార్టీ ఇండియా బ్లాక్ నుంచి బయటకి వచ్చింది. దీనిపై మా పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా స్పష్టంగా వెల్లడించారు. ఇకపై మేము ఆ కూటమిలో భాగంగా ఉండము" అని సంజయ్ సింగ్ చెప్పారు.

వివరాలు 

శక్తివంతమైన ప్రతిపక్షంగా ఆప్ 

"హరియాణా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మేము స్వతంత్రంగా పోటీ చేశాము. అదే విధంగా పంజాబ్, గుజరాత్ ఉపఎన్నికల్లో కూడా తాము ఒంటరిగా పోటీ చేశామని పేర్కొన్నారు. పార్లమెంట్ కార్యకలాపాల్లో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీల మద్దతు తీసుకుంటామని, వారు కూడా తమకు మద్దతు ఇస్తారని చెప్పారు. శక్తివంతమైన ప్రతిపక్షంగా తమ పార్టీ పనిచేస్తుందని, దేశానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా పార్లమెంట్‌లో లేవనెత్తుతామని" సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.