
అవినీతి, కులతత్వం, మతతత్వానికి భారత్‌లో స్థానం లేదు: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
స్వాతంత్య్రం వచ్చి 100ఏళ్లకు చేరువవుతున్న నేపథ్యంలో, 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారనున్న క్రమంలో భారత్‌లో అవినీతి, కులతత్వం, మతతత్వానికి స్థానం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక అంశాలపై మాట్లాడారు.
త్వరలో జరగనున్న జీ20 సదస్సు గురించి మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రపంచం ఇప్పుడు దిశానిర్దేశం కోసం భారతదేశం వైపు చూస్తోందన్నారు.
ఈ సమావేశాల్లో భారత్ చెప్పే మాటలు కేవలం ఆలోచనలు మాత్రమే కాదని, అవి ప్రపంచ భవిష్యత్‌కు రూట్ మ్యాప్ వంటివని అన్నారు.
ప్రపంచ జీడీపీ దృక్పథం.. జనాభా కేంద్రంగా మారిందని, ఈ పరివర్తనలో భారతదేశం పాత్ర చాలా కీలకమని ప్రధాన మంత్రి మోదీ అన్నారు.
మోదీ
భారతదేశంపై ప్రపంచం దృక్పథం మారుతోంది: మోదీ
భారతదేశంపై ప్రపంచం దృక్పథం మారుతోందన్నారు. చాలా కాలంగా భారత్ వందకోట్ల మంది ఆకలితో అలమటిస్తున్న దేశంగా కనిపించందని, ఇప్పుడు ఆ దృక్పథం మారిందన్నారు.
ప్రస్తుతం భారత్ అంటే, ఒక బిలియన్ ఆశయాలతో కూడిన మనస్సులు, నైపుణ్యం కలిగిన రెండు బిలియన్ల చేతులని ఆయన మోదీ అన్నారు.
రాబోయే 1,000 సంవత్సరాలకు గుర్తుండిపోయే వృద్ధికి పునాది వేయడానికి ఇప్పుడు భారతీయులకు గొప్ప అవకాశం ఉందని మోదీ అన్నారు.
ఒకప్పుడు కేవలం పెద్ద మార్కెట్‌గా భావించిన భారతదేశం.. ఇప్పుడు ప్రపంచ సవాళ్లకు పరిష్కారాల్లో అగ్రభాగాన నిలుస్తుందన్నారు.
మోదీ
'సబ్కా సాత్, సబ్కా వికాస్' ప్రపంచానికి మార్గదర్శక సూత్రం కావొచ్చు: మోదీ
జీ20 ప్రెసిడెన్సీ వల్ల భారతదేశం తృతీయ ప్రపంచం అని పిలవబడే దేశాల్లో విశ్వాస బీజాలను నాటిందని ప్రధాని మోదీ అన్నారు. 'సబ్కా సాత్, సబ్కా వికాస్' ప్రపంచ సంక్షేమానికి మార్గదర్శక సూత్రం కూడా కావచ్చని మోదీ అభిప్రాయపడ్డారు.
సమీప భవిష్యత్తులోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారనుందని స్పష్టం చేశారు.
దేశంలో 9సంవత్సరాల రాజకీయ స్థిరత్వం వల్లే దేశంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చినట్లు మోదీ చెప్పారు.
బాధ్యతా రహితమైన ఆర్థిక విధానాలు, పాపులిజం స్వల్పకాలిక రాజకీయ ఫలితాలను ఇవ్వవచ్చు కానీ దీర్ఘకాలంలో ప్రతికూల ఫలితాలను ఇస్తాయన్నారు.
మోదీ
ప్రపంచ శాంతికి భారత్ కృషి: మోదీ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం తీసుకున్న వైఖరిపై కూడా మోదీ మాట్లాడారు. వివాదాలను పరిష్కరించడానికి దౌత్యం మాత్రమే సరైన మార్గమని ప్రధాని పునరుద్ఘాటించారు.
జీ20 అధ్యక్షుడిగా ఉన్నా లేకున్నా ప్రపంచమంతటా శాంతిని నెలకొల్పేందుకు చేసే ప్రతి ప్రయత్నానికి భారత్ మద్దతుగా ఉంటామన్నారు.
వాతావరణ మార్పులపై మాట్లాడిన మోదీ, ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు మరింత చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.
వాతావరణ మార్పులతో పోరాడడంలో అన్ని దేశాలకు సరిపోయే పరిష్కారాలు లేవన్నారు. సాంకేతికత ప్రజాస్వామ్యీకరణకు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. సాంకేతికతతో తమ విధానాలు పెద్ద ప్రపంచ ఉద్యమానికి సోపానాలన్నారు.
మోదీ
ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు అవసరం: మోదీ
ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలపై ప్రధాని మోదీ కూడా మోదీ స్పందించారు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణల కోసం మోదీ పిలుపునిచ్చారు.
20వ శతాబ్దం విధానాలు 21వ శతాబ్దంలో ప్రపంచానికి సేవ చేయలేవని వివరించారు. అంతర్జాతీయ సంస్థలు మారుతున్న వాస్తవాలను గుర్తించాలన్నారు.
అలాగే వాటి ప్రాధాన్యతలను పునఃపరిశీలించాలన్నారు. దేశాల ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని మోదీ నొక్కి చెప్పారు.
అంతర్జాతీయ సంస్థలు కాలంతో పాటు మారకపోతే చిన్నపాటి ప్రాంతీయ ఫోరమ్‌లు కీలకకమైనవి మారే అవకాశం ఉందని మోదీ పేర్కొన్నారు.