'Bharat Jodo' vs 'Bharat Todo': కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక యుద్ధం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం బిహార్ పాట్నలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం సడకత్ ఆశ్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పాట్నలో నిర్వహిస్తున్న ప్రతిపక్ష నాయకుల సమావేశానికి హాజరవడానికి ముందు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో కాంగ్రెస్‌పార్టీకి, బీజేపీ మధ్య సైద్ధాంతిక యుద్ధం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ 'భారత్ జోడో', ఆరెస్సెస్, బీజేపీల 'భారత్ తోడో' సిద్ధాంతాల మధ్య భావజాల యుద్ధం జరుగుతోందని రాహుల్ ధ్వజమెత్తారు. బిహార్‌లో కాంగ్రెస్ డీఎన్‌ఏ ఉందన్నారు. విద్వేషం, హింసను వ్యాప్తి చేయడానికి, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్ అన్నారు. తాము మాత్రం ప్రేమను వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.
తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గెలుస్తాం: రాహుల్
ప్రతిపక్షాలు ఈరోజు బిహార్‌కు వచ్చాయని, అందరం కలిసి బీజేపీని ఓడిస్తామని రాహుల్ పేర్కొన్నారు. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గెలుస్తామని స్పష్టం చేశారు. రాజస్థాన్‌లో బీజేపీ ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. పేదలకు అండగా నిలిచి గెలుస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, బిహార్‌లో పార్టీ గెలిస్తే దేశవ్యాప్తంగా గెలుస్తామని అన్నారు. దేశానికి, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజలు ఏకం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2024లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి వ్యూహాన్ని రూపొందించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులు పాట్నలో సమావేశమయ్యాయి.