తమిళనాడు: బీజేపీని వీడిన నటి గౌతమి తాడిమళ్ల
ప్రముఖ నటి గౌతమి తాడిమళ్ల బీజేపీని వీడారు.తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి పార్టీ సీనియర్ సభ్యులు సహాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ప్రకటన పోస్టు చేశారు. తాను గత 25 సంవత్సరాలుగా బీజేపీలో సభ్యురాలిగా పార్టీకి చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పారు. గౌతమి తన ఆస్తుల నిర్వహణ బాధ్యతను అప్పగించిన సి అళగప్పన్ అనే వ్యక్తి 'డబ్బు, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్‌ల విషయంలో మోసం చేయడంతో అతని పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేసినప్పటి నుండి 40 రోజులు గడిచినా.. అతడు తప్పించుకు తిరిగేలా పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు అతనికి సాయం చేస్తున్నారని మండిపడ్డారు.
విధేయతగా పార్టీకి సేవ చేసినా మద్దతు కరువు: గౌతమి
2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు రాజపాళయం టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో వెనక్కు తీసుకున్నారు. అయినప్పటికీ తాను మౌనంగా ఉండి పార్టీ పట్ల నిబద్ధతను నిలబెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఎంతో విధేయతగా పార్టీకి సేవ చేసినా.. తనకు మద్దతు కరవైందని గౌతమి పేర్కొన్నారు. నిరాశతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్,పోలీసు శాఖ,న్యాయవ్యవస్థ తనకు కావాల్సిన న్యాయం అందిస్తాయన్న నమ్మకం తనకు ఇంకా ఉందని ఆమె పేర్కొన్నారు.