AP Flood Relief Fund: ఆంధ్రలో వరదలు.. గౌతమ్ ఆదానీ 25కోట్ల రూపాయల భారీ విరాళం
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ని భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా అతలాకుతలం చేశాయి. ఈ సమయంలో వరద బాధితులను ఆదుకునేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి (CMRF) విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కూడా ముందుకు వచ్చి, రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అదానీ సంస్థ ఎండీ కిరణ్ అదానీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన పత్రాలు అందజేస్తున్న ఫోటోను పంచుకున్నారు.
గౌతమ్ అదానీ చేసిన ట్వీట్
ముఖ్యమంత్రి సహాయనిధికి కొనసాగుతున్న విరాళాల వెల్లువ
ఇక ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది.స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్ తరఫున రూ.50లక్షల విరాళాన్ని సంస్థ ప్రతినిధులు చంద్రబాబుకు అందజేశారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రజల నుంచి సేకరించిన రూ.35 లక్షల విరాళాన్ని సీఎంకు అందజేశారు. గుంటూరుకు చెందిన గడ్డిపాటి సుధాకర్ దంపతులు రూ.20లక్షలు,ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ప్రతినిధులు రూ.10 లక్షలు,108 ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.10 లక్షలు,ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ రూ.24 లక్షలు విరాళం ఇచ్చారు. అలాగే మత్స్యకారుల సంక్షేమ సంఘం రూ.6 లక్షలు,మల్లవల్లి ఇండస్ట్రీస్ రూ.14.50 లక్షలు, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ రూ.50 లక్షలు విరాళం అందజేశారు. రాజమండ్రి రూరల్ ప్రజలు సేకరించిన దాదాపు రూ.83 లక్షల చెక్కును ఎమ్మెల్యే సీఎంకు అందించారు.