
Central Govt:పద్దెనిమిదేళ్లు నిండినవారికే లైంగిక చర్యలకు సమ్మతి హక్కు: కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
పద్దెనిమిదేళ్లు దాటినవారే లైంగిక చర్యకు సమ్మతి తెలపడానికి అర్హులన్న నియమాన్నికేంద్ర ప్రభుత్వం సమర్థించింది. ఈ వయోపరిమితిని 18 నుండి 16 సంవత్సరాలకు తగ్గించాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వాదనకు ప్రతిస్పందిస్తూ ప్రభుత్వం తన వైఖరిని సుప్రీంకోర్టులో వివరించింది. మైనారిటీ తీరనివారిని లైంగిక మోసాలు, దోపిడీలు వంటి ప్రమాదాల నుండి రక్షించడానికి ఈ విధానాన్ని ఉద్దేశపూర్వకంగా, సమగ్రంగా ఆలోచించి అమలు చేస్తున్నామని తెలిపింది.
వివరాలు
పిల్లల అక్రమ రవాణా, బాలలపై జరిగే నేరాలు..
అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి లిఖితపూర్వకంగా సమర్పించిన అభిప్రాయంలో, యువతీ-యువకుల మధ్య శృంగారభరిత ప్రేమ అనే పేరుతో ఈ వయోపరిమితిని సవరించడం చట్టపరంగా తప్పు మాత్రమే కాకుండా, సమాజానికి ప్రమాదకరమని స్పష్టం చేశారు. పిల్లల మౌనాన్ని,భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని లైంగిక దురాగతాలకు పాల్పడే వారిని ఈ పరిమితి అడ్డుకుంటుందని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. అలాగే, వయోపరిమితిని తగ్గిస్తే అదే సాకుగా పిల్లల అక్రమ రవాణా, బాలలపై జరిగే నేరాలు మరింతగా పెరిగిపోయే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.