Page Loader
Uber: 'క్యాబ్ బుకింగ్‌లకు టిప్ మోడల్ అనైతికం'.. ఉబర్‌కు నోటీసు పంపిన ప్రహ్లాద్ జోషి 
'క్యాబ్ బుకింగ్‌లకు టిప్ మోడల్ అనైతికం'.. ఉబర్‌కు నోటీసు పంపిన ప్రహ్లాద్ జోషి

Uber: 'క్యాబ్ బుకింగ్‌లకు టిప్ మోడల్ అనైతికం'.. ఉబర్‌కు నోటీసు పంపిన ప్రహ్లాద్ జోషి 

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో ఊబర్, ఓలా లాంటి క్యాబ్ సర్వీసులను అనేక మంది ప్రజలు నిత్యం ఉపయోగిస్తుంటారు. ఈ రవాణా సేవలపై చాలామంది అధికంగా ఆధారపడుతున్నారు.అయితే,ఈ క్యాబ్‌లు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండకపోవడం,అందుబాటులో ఉన్నా కూడా డ్రైవర్లు వెంటనే రావడం లేదని తరచూ వినిపిస్తున్న అసంతృప్తి ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఊబర్ సంస్థ "అడ్వాన్స్ టిప్" అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ప్రకారం,ప్రయాణికులు ముందుగానే టిప్ చెల్లిస్తే డ్రైవర్లు త్వరగా రావచ్చని ఊబర్ పేర్కొంది. అయితే ఈ విధానంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే క్యాబ్ రైడ్‌ రేట్లు పెరిగిపోయి ప్రయాణికులపై ఆర్థిక భారం పెంచుతున్నాయన్న ఆవేదన ఉండగానే,ఇప్పుడు టిప్ వ్యవహారంతో ఇది మరో వ్యాపార మోసంగా భావిస్తున్నవారు చాలామంది.

వివరాలు 

టిప్ పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం

టిప్ ఇచ్చినవారికే ముందుగా సేవ అందిస్తే, భవిష్యత్తులో అందరూ టిప్ కోరే అవకాశం ఉందని, టిప్ ఇవ్వని ప్రయాణికులకు డ్రైవర్లు వెళ్లరని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది."వినియోగదారులు వేగవంతమైన సేవ కోసం ముందుగానే టిప్ చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేయడం అనైతికం,ఇది వాణిజ్య దోపిడీకి దారితీస్తుంది" అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. వినియోగదారులు సేవల పట్ల సంతృప్తిగా ఉన్నప్పుడు స్వచ్ఛందంగా టిప్ ఇవ్వడమే మంచిదని, బలవంతంగా టిప్ వసూలు చేయడం అన్యాయం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనతో పాటు, కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (CCPA) ఊబర్‌కు నోటీసులు జారీ చేసి, అడ్వాన్స్ టిప్ విధానంపై స్పష్టత కోరింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రహ్లాద్ జోషి చేసిన ట్వీట్ 

వివరాలు 

డిఫరెన్షియల్ ప్రైసింగ్ వ్యవహారంపై  ఉబర్‌కు నోటీసులు 

ఇది మాత్రమే కాదు,గతంలో ఊబర్,ఓలా యాప్‌లు ఐఫోన్, ఆండ్రాయిడ్ లాంటి వేర్వేరు డివైస్‌లపై ఒకే రైడ్‌కు వేరే వేరే ధరలు చూపిస్తున్నాయన్న ఆరోపణలపై కూడా కేంద్రం స్పందించింది. ఈ డిఫరెన్షియల్ ప్రైసింగ్ వ్యవహారంపై 2025 జనవరి 23న CCPA ద్వారా ఉబర్‌కు నోటీసులు ఇచ్చారు. ఇక డ్రైవర్ల అభిప్రాయాలను చూసినా,ఈ అడ్వాన్స్ టిప్ వ్యవస్థపై వారు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ప్రయాణికులు ఇచ్చే టిప్స్ పూర్తిగా తమకు అందడం లేదని,వాటిని ఊబర్ యాజమాన్యం కట్టేసుకుంటోందని వారు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి కొందరు డ్రైవర్లు సోషల్ మీడియాలో ప్రూఫ్‌లు కూడా షేర్ చేస్తున్నారు.

వివరాలు 

టిప్ ఫీచర్‌పై ఫిర్యాదు చేయాలనుకుంటే..

ప్రయాణికులు ఈ అడ్వాన్స్ టిప్ ఫీచర్‌పై ఫిర్యాదు చేయాలనుకుంటే, ఉబర్ యాప్‌లో ఉన్న "Help" విభాగం ద్వారా లేదా help.uber.com వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అలాగే కేంద్ర వినియోగదారుల హెల్ప్‌లైన్ 1915 ద్వారా లేదా jagograhakjago.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.