కోర్టు ప్రాంగణంలో నాలుగో పెళ్లి పంచాయతీ.. లాయర్ భర్తను చితకబాదిన ముగ్గురు భార్యలు
జార్ఖండ్‌లోని ఓ కోర్టులో ఓ భార్త, ముగ్గురు భార్యలకు మధ్య పంచాయితీ మొదలైంది. భర్తను ముగ్గురు సతీమణులు కలిసి చితకబాదిన సంఘటన రాంచీ సివిల్ కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకుంది. రాంచీలోని సివిల్ కోర్టులో నయీముద్దీన్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయన వద్ద ఓ యువతి, జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గత కొద్ది కాలంగా ఆమెతో తమ భర్తకు సాన్నిహిత్యం ఏర్పడిందని, ఈ క్రమంలోనే మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారని ముగ్గురు భార్యలు ఆరోపిస్తూ కోర్టుకు వచ్చారు. ఇక్కడికి ఎందుకు వచ్చారని ముగ్గురు భార్యలను నయీముద్దీన్ నిలదీశాడు. దీంతో న్యాయస్థానం ప్రాంగణంలో వారికి మాటా మాటా పెరిగి వివాదం ముదిరింది.
నయీముద్దీన్ మొదటి భార్య రాంచీ కోర్టు ఉద్యోగే
ఈ నేపథ్యంలో తమ భర్త నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారని ఆరోపిస్తూ ఆయనపై ముగ్గురు భార్యలు దాడి చేశారు. ఈ ఘటన కోర్టు ప్రాంగణంలో కలకలం సృష్టించింది. తమ భర్త మరోసారి వివాహానికి యత్నిస్తున్నాడని, అతనితో తాడో పేడో తేల్చుకునేందుకే ఇక్కడికి వచ్చినట్లు అతని ముగ్గురు భార్యలు మీడియాతో గోడు వెల్లబోసుకున్నారు. అంతకుముందే కుటుంబ వివాదంలో కొందరు మహిళలు జోక్యం చేసుకుని నయీముద్దీన్ పై చేయి చేసుకున్నారు. చివరకు కేసు మహిళా ఠాణా వరకు వెళ్లింది. భర్తపై ముగ్గురు భార్యలు కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే కోర్టులో నయీముద్దీన్ మొదటి భార్య పని చేస్తుండటం కొసమెరుపు.