Page Loader
Bhopal Gas Tragedy:భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్లకు కీలక నిర్ణయం..  టాక్సిక్ వేస్ట్ నుండి విముక్తి
భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్లకు కీలక నిర్ణయం..

Bhopal Gas Tragedy:భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్లకు కీలక నిర్ణయం..  టాక్సిక్ వేస్ట్ నుండి విముక్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్ల తర్వాత, యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న 377 టన్నుల విషపూరిత వ్యర్థాలను భోపాల్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి తరలించారు. ఈ వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కుల్లో రాత్రి 9 గంటలకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి తరలింపు ప్రారంభించారు. సుమారు 7 గంటల ప్రయాణం తర్వాత ట్రక్కులు గమ్యస్థానానికి చేరుకున్నాయి. ఈ వ్యర్థాలను ప్యాక్ చేసి ట్రక్కుల్లోకి ఎక్కించేందుకు దాదాపు 100 మంది కార్మికులు ప్రతి 30 నిమిషాల షిఫ్టుల్లో పనిచేశారు.

వివరాలు 

ప్రక్రియకు తొమ్మిది నెలల సమయం

గత ఆదివారం నుంచే ఈ ప్యాకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కార్మికుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, వారికి ప్రతి 30 నిమిషాలకు విరామం ఇచ్చారు. భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ ప్రకారం, అన్నీ సజావుగా జరిగితే 3 నెలల్లో ఈ వ్యర్థాలను పూర్తిగా కాల్చివేయాలని ప్రణాళిక ఉంది. అయితే, ఏవైనా ఆటంకాలు ఏర్పడితే ఈ ప్రక్రియకు తొమ్మిది నెలల సమయం పట్టవచ్చని తెలిపారు. మొదట పితంపూర్ పారిశ్రామిక వాడలోని వ్యర్థ పదార్థాల యూనిట్‌లో కొంత వ్యర్థాలను కాల్చివేస్తారు. కాల్చిన తర్వాత మిగిలిపోయిన బూడిదను పరీక్షించి, హానికరమైన మూలకాలు లేవని నిర్ధారించాక, వాటిని భూమిలోని మట్టితో సంబంధంలోకి రాకుండా సురక్షితంగా పాతిపెడతారు.

వివరాలు 

వ్యర్థాల తరలింపును వ్యతిరేకిస్తూ నిరసన

ఈ ప్రక్రియను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి,రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పర్యవేక్షణలో నిపుణుల బృందం చేపడుతుంది. 2015లో కూడా పితంపూర్‌లో 10 టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను ప్రయోగాత్మకంగా కాల్చి పరిశీలించారు. అయితే, స్థానికులు ఆ వ్యర్థాల వల్ల మట్టి,భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని ఆరోపించారు. ఈ వాదనను భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ డైరెక్టర్ తోసిపుచ్చారు. 2015 పరీక్ష నివేదికల ఆధారంగా, అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే పితంపూర్ ప్రాంతంలో వ్యర్థాలను పారవేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పితంపూర్‌లోని 1.75 లక్షల జనాభా ఈ వ్యర్థాల తరలింపును వ్యతిరేకిస్తూ ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. అయినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.