
UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్ వ్యాపారవేత్త అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం దాడి నేపథ్యంలో ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర గాలింపు చర్యలు చేపడుతోంది.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాదులకు సహకరిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు నిఘా సంస్థలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇప్పటికే పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న అనేక మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు, తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను అరెస్ట్ చేసినట్టు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లోని రాంపుర్ ప్రాంతానికి చెందిన షాజాద్ అనే వ్యాపారవేత్త పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) తరఫున అక్రమ రవాణా, గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని అధికారులు వెల్లడించారు.
వివరాలు
ఉగ్రవాదుల వీసాల ఏర్పాట్లు
ఐఎస్‌ఐతో కొనసాగుతున్న సంబంధాల ఆధారంగా దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నిత సమాచారం పాక్‌కు చేరవేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్టు పేర్కొన్నారు.
అంతేకాకుండా, షాజాద్ పలు సార్లు పాకిస్థాన్ వెళ్లి తిరిగి వచ్చాడని, అక్కడికి సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు వంటి వస్తువుల రవాణా ముసుగులో గూఢచర్యానికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు.
అంతేకాకుండా, భారత్‌లో పలు సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసి, వాటిని దేశంలో పనిచేస్తున్న ఐఎస్‌ఐ ఏజెంట్లకు అందించేవాడని అధికారులు స్పష్టం చేశారు.
అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్‌లోని యువకులను ఉగ్రవాదం వైపునకు మళ్లించి,ఐఎస్‌ఐలో చేర్చేందుకు ప్రోత్సహించేవాడని చెప్పారు.
ఆ యువకులను పాక్‌కు పంపే కార్యక్రమంలో భాగంగా ఉగ్రవాదులు వారికి వీసాల ఏర్పాట్లు కూడా చేసేవారని వెల్లడించారు.
వివరాలు
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల సహాయకుల అరెస్ట్
ఇదే తరహాలో,ఇటీవల హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఆమె పాకిస్థాన్ ఐఎస్‌ఐతో సంబంధాలున్న డానిష్ అనే హైకమిషన్ ఉద్యోగితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జ్యోతి పోలీసుల కస్టడీలో ఉన్నారు.
ఉగ్రవాదులపై గాలింపు చర్యల నేపథ్యంలో,జమ్ముకశ్మీర్ ప్రాంతం సహా ఇతర సరిహద్దుల్లో సైన్యం, పోలీసుల సంయుక్త దళాలు ముమ్మరంగా గాలింపులు కొనసాగిస్తున్నాయి.
ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని,అనేక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశారు.
వివరాలు
షోపియాన్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదుల సహాయకుల అరెస్ట్
ఈ నేపథ్యంలో, ఆదివారం రాత్రి జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, భారత సైన్యం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదుల సహాయకులను అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.
వారి వద్ద నుంచి రెండు పిస్టళ్లు, నాలుగు గ్రనేడ్లు, 43 లైవ్ రౌండ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.