
Flights: ఇండిగో,ఎయిర్ ఇండియా కీలక ప్రకటన.. జమ్మూ, శ్రీనగర్ సహా పలు సరిహద్దు నగరాలకు విమాన సర్వీసులను రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ, పాకిస్థాన్ తరచుగా దాడులకు పాల్పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో సోమవారం డ్రోన్లు సంచరించినట్లు నివేదికలు వెల్లడించాయి.
ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల ప్రజల్లో మళ్లీ భయాందోళన మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తం అయ్యాయి.
పాకిస్థాన్‌తో సరిహద్దును పంచుకునే నగరాలపై విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు ప్రకటించాయి.
ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపినదానిని ప్రకారం, ''ప్రస్తుత పరిణామాలు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 13 మంగళవారం నాడు జమ్మూ,లేహ్,జోధ్‌పుర్, అమృత్‌సర్,భుజ్,జామ్‌నగర్,చండీగఢ్,రాజ్‌కోట్ నగరాలకు విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. పరిస్ధితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైన అప్‌డేట్‌లను అందిస్తాం'' అని పేర్కొంది.
వివరాలు
ప్రయాణికుల భద్రత మా ప్రథమ ప్రాధాన్యత: ఇండిగో
ఇక, ఇండిగో కూడా ఇలాగే స్పందించింది. ''ప్రయాణికుల భద్రత మా ప్రథమ ప్రాధాన్యత. ఈ నిర్ణయం వల్ల ప్రయాణ ప్రణాళికలకు అంతరాయం కలుగుతుందన్న విషయం మాకు తెలుసు. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో విమాన సర్వీసులను రద్దు చేయడం తప్ప మరే మార్గమూ లేదు. దీనివల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము విచారిస్తున్నాం'' అని తెలిపింది.
ఇండిగో సంస్థ శ్రీనగర్, లేహ్, రాజ్‌కోట్, చండీగఢ్, జమ్మూ, అమృత్‌సర్ ప్రాంతాలకు విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.