
Vijayawada: విజయవాడ ట్రాఫిక్ సమస్యకు ఏఐ ఆధారిత పరిష్కారం
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడ ప్రజలు ప్రతి రోజు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఇబ్బంది ట్రాఫిక్ జాం. ఒకసారి రద్దీలో ఇరుక్కుంటే, దానిని దాటి వేరే మార్గంలో గమ్యస్థానానికి చేరుకోవడం కష్టసాధ్యం అవుతుంది. ఈ సమస్యను తగ్గించేందుకు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏఐ ఆధారిత మొబైల్ యాప్ తయారవుతోంది. ఈ యాప్‌ను త్వరలో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా అధికారికంగా ప్రారంభించనున్నారు.
వివరాలు
పోలీసులు వాడిన టూల్ ఇప్పుడు ప్రజలకు
ఇప్పటివరకు కేవలం పోలీసు శాఖలో మాత్రమే ఉపయోగిస్తున్న "అస్త్రం" అనే ఏఐ టూల్‌ను ఇప్పుడు సాధారణ ప్రజలకు మొబైల్ యాప్ రూపంలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. గత సంవత్సరం దసరా వేడుకల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం దీనిని కమిషనరేట్ ట్రాఫిక్ విభాగంలో ప్రయోగాత్మకంగా వినియోగించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా అధికారులు, సిబ్బందికి రద్దీ వివరాలు అలర్ట్‌ల రూపంలో చేరేవి. ఆ సమాచారం ఆధారంగా సంబంధిత సీఐలు, ఎస్సైలు ట్రాఫిక్‌ను నియంత్రించేవారు. మంచి ఫలితాలు రావడంతో ఇప్పుడు ఈ సదుపాయాన్ని పౌరులకూ విస్తరించాలన్న నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
రద్దీ హెచ్చరికలు, ప్రత్యామ్నాయ మార్గాలు
క్రొత్త యాప్‌లో అనేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. నగర మ్యాప్‌ను అనుసంధానం చేసి అన్ని ప్రధాన రహదారులపై రద్దీ స్థాయిని చూపిస్తుంది. 300 మీటర్ల వరకూ వాహనాలు నిలిస్తే - మధ్యస్థ రద్దీగా, 300 నుండి 500 మీటర్ల వరకూ ఉంటే - అధిక రద్దీగా, 500 మీటర్లకు మించి ఉంటే - తీవ్రమైన రద్దీగా సూచిస్తూ మొబైల్‌లో అలర్ట్ వస్తుంది. జీపీఎస్ ఆన్ చేసినప్పుడల్లా మన పరిసరాల్లో ట్రాఫిక్ పరిస్థితిని చూపిస్తుంది.రద్దీ అధికంగా ఉంటే,ఏ మార్గం తీసుకుంటే త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చో సూచనలు ఇస్తుంది. దిశానిర్దేశాలు కూడా అందిస్తుంది. అంతేకాదు, భారీ వర్షాలు కురిసి రోడ్లు ముంచినప్పుడు, ఆ ప్రాంతాలను తప్పించుకునే మార్గాల వివరాలను కూడా తెలియజేస్తుంది.
వివరాలు
యూజర్లకు నోటిఫికేషన్లు..
ప్రభుత్వ కార్యక్రమాలు జరిగే రోజుల్లో ట్రాఫిక్ మళ్లింపుల సమాచారం,వీవీఐపీల గ్రీన్ ఛానల్ వాహన శ్రేణి ప్రయాణిస్తున్నప్పుడు కూడా యూజర్లకు నోటిఫికేషన్లు వస్తాయి. అదనపు సదుపాయాలు: చలానాలు, వాతావరణం, రవాణా వివరాలు ఈ యాప్‌లో ట్రాఫిక్ సమాచారం మాత్రమే కాకుండా మరిన్ని ఉపయోగకరమైన ఫీచర్లు కూడా ఉంటాయి. విజయవాడ జంక్షన్ మీదుగా వెళ్ళే రైళ్లు, బస్సుల సమయ వివరాలు. వాతావరణ అప్‌డేట్లు.. వర్షం, పిడుగులు, ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం వంటి సమాచారం ప్రతి గంటకు ఒకసారి అప్‌డేట్ అవుతుంది. ఈ-చలానాలు చెల్లించడానికి సులభమైన వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. వాహన నంబర్ ఎంటర్ చేస్తే పేమెంట్ గేట్‌వేకు కనెక్ట్ అయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు.