Page Loader
బీజేపీ-ఏఐఏడీఎంకే పొత్తు కొనసాగుతుంది: ఈపీఎస్
బీజేపీతో పొత్తు ఉంటుందని స్పష్టం చేసిన ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి

బీజేపీ-ఏఐఏడీఎంకే పొత్తు కొనసాగుతుంది: ఈపీఎస్

వ్రాసిన వారు Stalin
Apr 03, 2023
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) సోమవారం అన్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తమతో చెప్పిందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తమతో చర్చలు జరుపుతున్నారన్నారు. పొత్తు విషయంలో బీజేపీలోని రాష్ట్ర నేతలు నిర్ణయం తీసుకోరని, దిల్లీ పెద్దలే నిర్ణయిస్తారని చెప్పారు. పొత్తుల గురించి తాము సాధారణంగా రాష్ట్ర నేతలతో కాకుండా కేంద్ర నాయకత్వంతో నేరుగా చర్చిస్తామన్నారు.

బీజేపీ

ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది: అన్నామలై

బీజేపీ-ఏఐఏడీఎంకే పార్టీలు ప్రస్తుతానికి మిత్రపక్షంగా ఉన్నాయని, అయితే 2024 జాతీయ ఎన్నికలకు తమ భాగస్వామ్యం ఖరారు కాలేదని ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని, ఇరు పార్టీల పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఆదివారం మాట్లాడారు. పొత్తుపై షాతో తాను చర్చించానని, ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉందని, ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. అన్నామలై మాట్లాడి 24గంటలు గడవక ముందే పొత్తు ఉంటుందని పళనిస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.