
Black Box: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం.. విదేశాలకు ధ్వంసమైన ఎయిరిండియా బ్లాక్‌బాక్స్..!
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఘోరమైన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం కొద్ది సేపటికే కూలిపోవడం తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన ముఖ్యమైన ఆధారంగా భావిస్తున్న బ్లాక్ బాక్స్ (Black Box) కూడా ఈ ప్రమాదంలో దెబ్బతినినట్టు తెలుస్తోంది. దానిలో ఉన్న డేటాను విశ్లేషించేందుకు ఆయా అధికార వర్గాలు దాన్ని విదేశాలకు పంపించేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. సంబంధిత అధికారుల ప్రకటనల ఆధారంగా పలు ప్రముఖ మీడియా సంస్థలు ఈ విషయాన్ని నివేదించాయి.
వివరాలు
నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డుకు బ్లాక్‌బాక్స్
ప్రమాదం అనంతరం, స్థానికంగా ఉన్న బీజే వైద్య కళాశాల భవనం మీద నుండి అధికారులు బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, తాజాగా విడుదలైన అధికారిక సమాచారం ప్రకారం, ప్రమాద సమయంలో బ్లాక్‌బాక్స్ ధ్వంసం అయినట్టు తేలింది. అందువల్ల, అందులోని సమాచారాన్ని మరింత స్పష్టంగా విశ్లేషించేందుకు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డుకు పంపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బ్లాక్‌బాక్స్‌ను అమెరికాకు తరలించే ప్రక్రియలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని, అలాగే భారత్‌కు చెందిన అధికారుల బృందం కూడా దీనికి తోడుగా వెళ్తుందని సమాచారం. అయితే, దీనికి సంబంధించిన తుది నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు.
వివరాలు
బ్లాక్‌బాక్స్‌లోని డేటా చాలా కీలకం
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు బయలుదేరిన ఈ విమానం, గాల్లోకి లేచిన వెంటనే అక్కడే ఉన్న ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో విమాన సిబ్బంది, ప్రయాణికులు కలిపి మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 241 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమాన ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు బ్లాక్‌బాక్స్‌లోని డేటా చాలా కీలకంగా మారింది. అందుకే ఈ డేటాను పునరుద్ధరించేందుకు నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.