LOADING...
Air India Plane Crash: విమానం కూలిన తర్వాత.. వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు 
విమానం కూలిన తర్వాత.. వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు

Air India Plane Crash: విమానం కూలిన తర్వాత.. వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనేక కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచేసింది. టేకాఫ్‌ అయిన కొద్దిక్షణాలకే విమానం కూలిపోయి భీకరమైన మంటల్లో కాలిపోయింది. ఈ దుర్ఘటనకు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారుల సమాచారం మేరకు, విమానం కూలిన అనంతరం అక్కడ 1000 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగాయని వెల్లడించారు. ఇది సహాయక చర్యలను తీవ్రమైన సవాలుగా మార్చిందని తెలిపారు.

వివరాలు 

1.25 లక్షల లీటర్ల ఇంధనం

ఈ ప్రమాదానికి గురైన విమానంలో సుమారు 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ కారణంగా ప్రయాణికులను రక్షించేందుకు ఎలాంటి అవకాశం లేకుండా పోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎస్‌డీఆర్‌ఎఫ్‌కి చెందిన ఒక అధికారి స్పందిస్తూ, "ప్రమాద సమాచారం అందిన వెంటనే మధ్యాహ్నం 2 నుండి 2:30 మధ్యలో మా బృందం అక్కడికి చేరుకుంది. మేము చేరేలోపు హాస్టల్‌లో శిథిలాల కింద చిక్కుకున్న కొంతమందిని స్థానికులు కాపాడారు. కానీ మంటలు వేగంగా విస్తరించడంతో పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది," అని వివరించారు.

వివరాలు 

శరీరాలు తీవ్రంగా కాలిపోవడంతో..

"మేము గతంలో ఎన్నో సహాయక చర్యల్లో పాల్గొన్నాం.కానీ ఇంత భారీ విపత్తును ఎప్పుడూ చూడలేదు. విమానంలోని ఇంధన ట్యాంకు పేలిపోయిన తర్వాత ఒక అగ్నిప్రళయం ఏర్పడింది.కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే ప్రాంతంలోని ఉష్ణోగ్రత 1000డిగ్రీల సెల్సియస్‌కి పెరిగిపోయింది.దీంతో లోపల చిక్కుకున్నవారు బయటపడే అవకాశం కోల్పోయారు.మేము పీపీఈ కిట్లు ధరించి అక్కడకు వెళ్లినా, మంటల ఉష్ణం తీవ్రంగా ఉండటంతో సహాయక చర్యలు కొనసాగించలేకపోయాం.ఆ స్థాయిలో వేడి కారణంగా పక్షులు,శునకాలు కూడా పారిపోలేనంత స్థాయిలో ఉష్ణోగ్రత ఉంది. ప్రమాద స్థలంలో పలు పక్షులు,శునకాలు పూర్తిగా కాలిపోయాయి.చుట్టూ చూస్తే అంతా శిథిలాలే కనిపించాయి.వాటి క్రింద ప్రయాణికుల శరీరాలు తీవ్రంగా కాలిపోవడంతో వారిని గుర్తించడం చాలా కష్టంగా మారింది," అని ఆయన ఆ భయానక దృశ్యాలను గుర్తు చేసుకున్నారు.

వివరాలు 

ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్షలు 

ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులు, అలాగే సమీపంలోని వైద్య కళాశాల హాస్టల్‌లో ఉన్న మరో 24 మంది మరణించారు. మృతదేహాలన్నింటినీ అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవపరీక్షలు నిర్వహించారు. కొంతమంది మృతదేహాలు ప్రమాద తీవ్రత కారణంగా పూర్తిగా కాలిపోయినందున, వారి గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి ఆ తరువాత కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.