Page Loader
Air india Flight Crash: అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో గుజరాత్‌ మాజీ సీఎం 
అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో గుజరాత్‌ మాజీ సీఎం

Air india Flight Crash: అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో గుజరాత్‌ మాజీ సీఎం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ భయానక విమాన ప్రమాదం సంభవించింది. లండన్‌ వెళ్లేందుకు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ప్రయాణిస్తున్నట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. విమానంలో ఆయన ప్రయాణానికి సంబంధించిన టికెట్‌ ఒకటి ముందుగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ టికెట్‌లో మధ్యాహ్నం 12:10 గంటల సమయంలో బోర్డింగ్‌ టైమ్‌గా పేర్కొనబడింది. పైగా, ప్రయాణికుల జాబితాలో కూడా విజయ్‌ రూపానీ పేరు ఉండటంతో ఆయన వాస్తవంగా విమానంలో ఎక్కారనే అనుమానాలు బలపడుతున్నాయి.

వివరాలు 

రెండు టెర్మ్‌లు గుజరాత్ ముఖ్యమంత్రిగా రూపానీ 

లండన్‌లో నివసిస్తున్న తన కుమార్తెను కలవడానికి ఈ ప్రయాణం చేస్తున్నట్టు స్థానిక వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే, ఈ ప్రమాదంలో ఆయనకు ఏమైనా అపాయం జరిగిందా? లేక ఆయన సురక్షితంగా ఉన్నారా అన్న విషయం ఇంకా అధికారికంగా బయటపడలేదు. భారతీయ జనతా పార్టీకి చెందిన విజయ్‌ రామ్‌నిక్‌లాల్‌భాయ్‌ రూపానీ 2016 నుండి 2021 వరకూ రెండు టెర్మ్‌లు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఆయన చిన్న కుమారుడు పూజిత్‌ గతంలో జరిగిన ఓ ప్రమాదంలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.

వివరాలు 

విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది

ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా ఏఐ-171 విమానంలో జరిగింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అది కూలిపోయింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రదేశంలో సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.