Air India: టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం.. దర్యాప్తు ప్రారంభించిన DGCA
దిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం పూణె విమానాశ్రయంలో ప్రమాదానికి గురైంది. వాస్తవానికి విమానం టేకాఫ్ కోసం రన్‌వే వైపు వెళుతుండగా అదే సమయంలో టగ్ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. విమానంలో దాదాపు 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటన గురువారం అంటే నిన్న మే 16వ తేదీన జరిగింది. అయితే టగ్ ట్రాక్టర్‌ను ఢీకొనడం వల్ల విమానం ముక్కు భాగం, అలాగే ల్యాండింగ్ గేర్ దగ్గర టైర్ దెబ్బతింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను విమానం నుంచి దించేశారు.
ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఎవరూ గాయపడినట్లు ఎటువంటి నివేదిక లేదు, ప్రయాణికులకు వారి పూర్తి ఛార్జీలను వాపసు చేసి, ప్రత్యామ్నాయ విమానాలలో పంపినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. అక్కడి నుంచి మరో విమానం ఎక్కేందుకు వీలుగా అంతర్జాతీయ కనెక్షన్లు ఉన్న వారిని ఇతర వాహనాల్లో ఢిల్లీకి పంపించారు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు అధికార ప్రతినిధి తెలిపారు.
విచారణ ప్రారంభించిన డీజీసీఏ
విమానం ఢీకొనడానికి గల కారణాలను తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) దర్యాప్తు ప్రారంభించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, భూమిపై విమానాన్ని తరలించడానికి ఉపయోగించే టగ్ ట్రక్ విమానాన్ని ఢీకొట్టింది. DGCA దర్యాప్తు కార్యాచరణ ప్రోటోకాల్‌లు , సంఘటనకు దారితీసిన వాటిని తెలుసుకోవడానికి సంబంధిత లోపాలపై దృష్టి పెడుతుంది. ప్రమాదం తర్వాత, విమానాశ్రయ కార్యకలాపాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాయి. అయితే, ప్రమాదానికి గురైన విమానం కొంతకాలం తనిఖీ,మరమ్మతుల కోసం బయటకు తీశారు. ఇప్పుడు పూర్తిగా ఆపరేషన్‌కు సిద్ధంగా ఉంది.
సమ్మెకు దిగిన ఉద్యోగులు
ఇటీవల, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద సంఖ్యలో సీనియర్ సిబ్బంది అకస్మాత్తుగా 'సిక్ లీవ్'పై వెళ్లారు. దీని కారణంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కి చెందిన దాదాపు 250 విమానాలు చాలా రోజులు రద్దు చేయబడ్డాయి. అయితే, ప్రయాణికులకు రీఫండ్ లేదా ఇతర విమాన సౌకర్యాన్ని కల్పిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అదే సమయంలో, సెలవు తీసుకున్న చాలా మంది ఉద్యోగులపై కూడా కంపెనీ చర్యలు తీసుకుంది. దీంతో ఆగ్రహించిన ఇతర ఉద్యోగులు సంస్థ నిర్వహణలోపంపై ప్రశ్నలు సంధించి సమ్మెకు దిగారు. ఈ ఒక్క ఘటనతో కంపెనీ కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది.