LOADING...
Air Pollution: డేంజర్ బెల్స్.. కాలుష్యం కోరల్లో రాష్ట్రం..  ఆ 3 ప్రాంతాలు మరీ డేంజరట
డేంజర్ బెల్స్.. కాలుష్యం కోరల్లో రాష్ట్రం.. ఆ 3 ప్రాంతాలు మరీ డేంజరట

Air Pollution: డేంజర్ బెల్స్.. కాలుష్యం కోరల్లో రాష్ట్రం..  ఆ 3 ప్రాంతాలు మరీ డేంజరట

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం వాయు కాలుష్యం రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. నగరాలు, పట్టణాల్లో మొత్తం 10 ప్రాంతాల్లో గాలిలో కలుషితత స్థాయిని పరిశీలించగా.. ప్రతి ప్రాంతం కాలుష్య భయంకర ప్రభావానికి లోనైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని ఏ ఒక్క పట్టణం లేదా నగరంలోనూ స్వచ్ఛమైన గాలి లభించే పరిస్థితి లేదు. ప్రతి ఘన మీటరు గాలిలో 'పార్టిక్యులేట్ మ్యాటర్-10 (PM10)' అనే సూక్ష్మ ధూళి కణాలు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సూచించిన హద్దు అయిన 60 మైక్రోగ్రాముల కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం అయితే ఇది 40 మైక్రోగ్రాములకే పరిమితమై ఉండాలి.

వివరాలు 

రామగుండం, పటాన్‌చెరు, కొత్తూరు..  తీవ్ర కాలుష్య కేంద్రాలు 

రాష్ట్రంలో అత్యంత కాలుష్య భయంకర ప్రాంతాలుగా రామగుండం,పటాన్‌చెరు,కొత్తూరు మారుతున్నాయి. గాలి నాణ్యత విషయంలో హైదరాబాద్‌తో పోలిస్తే ఈ మూడు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దిగజారింది. నల్గొండలో 2022లో PM10 స్థాయి 54గా ఉండగా,2023లో అది 60కి చేరింది. నిజామాబాద్‌లో అదే కాలంలో ఇది 56 నుండి 69కి పెరిగింది. పరిశ్రమల నుంచి వెలువడే పొగ, రోడ్లపై ఉన్న ధూళి,వాహనాల ఉద్గారాలు, నిర్మాణ వ్యర్థాలు, రైస్‌మిల్లులు, చెత్త దహనం చేయడం వంటి కారణాల వల్ల PM10, PM2.5, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి హానికర గ్యాస్‌లు వాతావరణంలోకి వెలువడుతున్నాయి. ఇవి స్వచ్ఛమైన గాలిని పూర్తిగా కలుషితం చేస్తూ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. ఈ వాటిలో ముఖ్యంగా PM10 గణనీయమైన హానికర మూలకం.

వివరాలు 

ప్రతి ప్రాంతంలో వేరే వేరే కారణాలు 

వాయు కాలుష్యం ఏర్పడటానికి ప్రతి ప్రాంతంలో వేరే వేరే కారణాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రధానంగా వాహనాల ధ్వని, ఉద్గారాలు, మరియు పరిశ్రమల వల్ల కాలుష్యం విస్తరిస్తోంది. అయితే రామగుండంలో పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. అక్కడ పరిశ్రమలతో పాటు థర్మల్ విద్యుత్ కేంద్రాలు, బొగ్గు గనులు ప్రధాన కారణాలుగా మారాయి.

వివరాలు 

వాయు కాలుష్యం ప్రభావాలు ఎలా ఉంటాయి? 

వాయు కాలుష్యం తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రభావాలను చూపిస్తుంది. తక్షణంగా దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. దీర్ఘకాలంగా అయితే శ్వాస సంబంధిత వ్యాధులు - ముఖ్యంగా ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాదు, పర్యావరణానికి కూడా దీని వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది.