అన్ని ఒక్కొక్కటిగా వెనక్కి.. రాహుల్‌కు అధికారిక నివాసంగా పాత బంగ్లానే..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు తొలిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన నేడు లోక్ సభలో అడుగుపెట్టారు. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలకు సంబంధించిన క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఎంపీగా ఆయన సభ్యత్వాన్ని తిరిగి పునరుద్దరిస్తూ లోక్ సభ సెక్రటేరియేట్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఆయనకు ప్రభుత్వ బంగ్లా కేటాయింపునకు లోక్ సభ హౌసింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాహుల్ ఖాళీ చేసిన 12 తుగ్లక్ లేన్‌లోని బంగ్లాను తిరిగి ఆయనకే కేటాయించారు.
మేరా ఘర్ పూరా హిందుస్థాన్ హై : రాహుల్ గాంధీ
పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన తర్వాత లోక్ సభ సభ్యత్వం రద్దు కావడంతో తుగ్లక్ రోడ్డులోని అధికారిక బంగ్లాను రాహుల్ ఖాళీ చేసిన విషయం తెలిసిందే. 2005 నుంచి రాహుల్ ఆ బంగ్లాలోనే ఉన్నారు. ఈ విషయంపై రాహుల్ గాంధీని ప్రశ్నించగా, 'మేరా ఘర్ పూరా హిందుస్థాన్ హై' అంటూ సమాధానమిచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇదిలా ఉండగా.. రాహుల్ తన ట్విట్టర్ ఖాతాలో తన ప్రొఫైల్‌ను కూడా మార్చారు. అనర్హమైన ఎంపీ (డిస్ క్వాలిఫైడ్ MP) అని ఉండే ట్విటర్ బయోను పార్లమెంటు సభ్యునిగా మార్చుకున్నారు.