ECI: సర్ నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే.. సుప్రీం కోర్టులో ఎన్నికల సంఘం అఫిడవిట్
ఈ వార్తాకథనం ఏంటి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే వెలువడ్డాయని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మరోసారి స్పష్టం చేసింది. గత ఏడాది జూన్, అక్టోబరులో, ఈ ఏడాది మేలో జారీ చేసిన మూడు ఉత్తర్వులకూ ముగ్గురు కమిషనర్ల ఆమోదం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది. సర్ ప్రక్రియను చట్ట నిబంధనలకు అనుగుణంగానే అమలు చేస్తున్నామని పేర్కొంది. ఫారం-6లో తాము ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించింది.
వివరాలు
విచారణను అక్టోబరు 27వ తేదీకి వాయిదా
సర్ పేరుతో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ దేశవ్యాప్తంగా ఇష్టానుసారం ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సహా 12 మంది విపక్ష నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సర్ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై స్పందన తెలియజేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 15న ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
తదుపరి విచారణను అక్టోబరు 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈసీఐ సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
వివరాలు
అవి వ్యక్తిగత అభిప్రాయాలే..
దస్త్రాలు ఒకరి నుంచి మరొకరికి వెళ్లే క్రమంలో అధికారులు రాసే నోట్లు, వెల్లడించే అభిప్రాయాలు వ్యక్తిగతమైనవేనని ఎన్నికల సంఘం తన అఫిడవిట్‌లో వివరించింది.
వాటిని కమిషన్ అధికారిక నిర్ణయాలుగా పరిగణించకూడదని స్పష్టం చేసింది.
సర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లన్నీ ఓ వార్తాపత్రికలో ప్రచురితమైన కథనాల ఆధారంగానే వేశారని పేర్కొంది.
వాటిని కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరింది. సర్ విషయంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ సీఈసీ వాటిని పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారంటూ వచ్చిన వార్తలను, విపక్షాల ఆరోపణలను ఈసీఐ ఖండించింది.
దస్త్రాలు వివిధ అధికారుల వద్దకు వెళ్లే సమయంలో సీఈసీ, ఇతర కమిషనర్లు రాసే నోట్లు, అడిగే ప్రశ్నలు, ఇచ్చే సూచనలు కమిషన్ అధికారిక నిర్ణయాలుగా పరిగణనలోకి రావని తెలిపింది.
వివరాలు
అవి వ్యక్తిగత అభిప్రాయాలే..
వివిధ విభాగాలు సిద్ధం చేసిన దస్త్రాలను మొదట ఒక ఎన్నికల కమిషనర్ పరిశీలనకు పంపిస్తారని, అనంతరం మరో కమిషనర్ వద్దకు వెళ్తాయని వివరించింది.
చివరగా అవి సీఈసీకి చేరుతాయని పేర్కొంది. కమిషన్ ఆమోదించిన నిర్ణయాలను అధికారిక పత్రాల్లో నమోదు చేస్తామని, వాటిపై సీఈసీ, ఎన్నికల కమిషనర్ల సంతకాలు ఉంటాయని తెలిపింది.
అనంతరం ఎన్నికల సంఘం సెక్రటేరియట్ ఆ నిర్ణయాలను అధికారికంగా ప్రకటించి అమలు చేస్తుందని వివరించింది.
వివరాలు
ఆ పని కేంద్ర ప్రభుత్వమే చేయగలదు
నిర్దేశించిన అధికార పరిధిని దాటి ఏ అధికారి కూడా ఉత్తర్వులు జారీ చేయకూడదని ఈసీఐ స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఈసీఐకి డెప్యుటేషన్‌పై వచ్చిన అదనపు కార్యదర్శి జులై 28న పని విభజనకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారని వెల్లడించింది.
దీనిపై మరుసటి రోజు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాశారని పేర్కొంది.
జులై 30న ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సంయుక్తంగా ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అదనపు కార్యదర్శి ఇచ్చిన పని విభజన ఆదేశాలు అమలులోకి రాలేదని వివరించింది.
వివరాలు
ఆ పని కేంద్ర ప్రభుత్వమే చేయగలదు
ఫారం-6లో తాము ఎలాంటి మార్పులూ చేయలేదని ఈసీఐ మరోసారి స్పష్టం చేసింది.
ఆ ఫారంలో మార్పులు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని పేర్కొంది.
అయితే అక్టోబరు 21 నుంచి కాగితంపై వినియోగించే అసలు ఫారం మాదిరిగానే ఆన్‌లైన్ దరఖాస్తును కూడా ఫారం-6, డిక్లరేషన్‌గా వేర్వేరుగా విభజించినట్లు తెలిపింది.
వివరాలు
అరుదైన కేసుల్లోనే విచారణ
సర్ ప్రక్రియలో మ్యాపింగ్ కాని ఓటర్లు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వారి ఇళ్లకు వెళ్లి బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) అవసరమైన పత్రాలను సేకరిస్తారని తెలిపింది.
ఓటరు నమోదు అధికారి (ఈఆర్వో) ఆదేశాలు లేకుండా ఈసీఐనెట్‌లో ఓటర్ల పేర్లను చేర్చడం లేదా తొలగించడం సాధ్యం కాదని వెల్లడించింది.
సర్ ఉత్తర్వులు సక్రమంగా అమలవుతున్నాయో లేదో పరిశీలించేందుకు ఐఐటీ, ఐఐఎస్‌సీల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
గోవాలో ఓటరు జాబితా నుంచి తొలగించిన 97 మందిలో 88 మంది ఇప్పటికే తమ పేర్లను తిరిగి నమోదు చేసుకున్నారని అఫిడవిట్‌లో పేర్కొంది.
వివరాలు
అఫిడవిట్‌లో ఈసీఐ వెల్లడించిన ఇతర అంశాలు
సీఈసీని నిలువరించాలంటూ దాఖలైన పిటిషన్లకు విచారణార్హత లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. సీఈసీని పదవి నుంచి తొలగించాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించేందుకు అనుసరించే విధానాన్నే పాటించాల్సి ఉంటుందని తెలిపింది.
ఎన్నికల సంఘం అంతర్గత దస్త్రాల్లోని నోట్లను ఎప్పుడూ మీడియాకు విడుదల చేయలేదని స్పష్టం చేసింది. వాటిని మీడియాకు అందించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదని పేర్కొంది.
ఈవీఎంల వినియోగాన్ని సవాలు చేస్తూ గతంలో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసిందని గుర్తుచేసింది.
వివరాలు
అఫిడవిట్‌లో ఈసీఐ వెల్లడించిన ఇతర అంశాలు
ఓటరు జాబితాలో పేర్లను చేర్చడానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయ అధికారులు అప్పీళ్లు దాఖలు చేశారని తెలిపింది. అయితే ఆ అంశాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురాలేదని పేర్కొంది.
దసరా సెలవుల కారణంగా ప్రస్తుతం సంక్షిప్త అఫిడవిట్ మాత్రమే దాఖలు చేశామని ఈసీఐ వివరించింది. అన్ని అంశాలపై పేరాల వారీగా పూర్తి వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును కోరింది.