
Andhra Pradesh: రిజిస్ట్రేషన్‌తోపాటే దస్తావేజులూ సిద్ధం.. 4 కార్యాలయాల్లో గంటన్నరలోపే అందజేత
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఆదాయం అందిస్తున్ననాలుగు ప్రధాన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పూర్తైన గంటన్నర వ్యవధిలోనే సంబంధిత దస్తావేజులు అందజేస్తున్నారు. అదేవిధంగా, మిగిలిన అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిశాక, సబ్‌రిజిస్ట్రార్ డిజిటల్ సంతకం చేసిన వెంటనే ఆ డాక్యుమెంట్ సిద్ధమైందని తెలియజేస్తూ కొనుగోలుదారుల వాట్సాప్ నెంబరుకు లింక్ పంపిస్తున్నారు. దీని వల్ల, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు కార్యాలయాల్లో గడిపే సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ కొత్త విధానం విజయవాడ పటమట,విశాఖపట్టణంలోని ఆర్‌ఓ కార్యాలయం,గుంటూరు నగరంలోని కొరిటెపాడు,తిరుపతి రూరల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించబడింది. దీని అమలుతో డాక్యుమెంట్లు వేగంగా సిద్ధమవుతున్నాయి.దీనికోసం ఆయా కార్యాలయాల్లో నలుగురు అదనపు సిబ్బందిని నియమించారు. త్వరలోనే ఇతర కార్యాలయాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
వివరాలు
రాచరిక వ్యవస్థ తొలగింపు
చాలాప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ జరిగే రోజే డాక్యుమెంట్ అందడం సాధ్యపడకపోతున్న పరిస్థితుల్లో, డాక్యుమెంట్ సిద్ధమైన వెంటనే వాట్సాప్ ద్వారా లింక్ పంపడం ప్రజలకు ఊరటనిస్తోంది. ఆలింక్ ద్వారా వారు తమ డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని పొందుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టింది. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా కొనుగోలు,విక్రయదారుల సమయాన్ని ఆదా చేస్తూ, కార్యాలయాల పనితీరులో వేగం తీసుకొచ్చింది. అంతేకాదు,గతంలో కనిపించే రాచరిక ధోరణిలో ఉన్న ఎరుపు బల్లలను తొలగించింది. ఈ నెల 1వ తేదీ నుంచి, రాష్ట్రంలోని 17మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో,రిజిస్ట్రేషన్ పూర్తయ్యిన వెంటనే సంబంధిత ఆస్తి పన్ను చెల్లింపుదారుని పేరు ఆటోమేటిక్‌గా మారే విధంగా(ఆటో మ్యూటేషన్)ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
వివరాలు
సక్సెషన్ రిజిస్ట్రేషన్‌లపై సందిగ్ధత
ఇక గ్రామ సచివాలయాల్లో వారసత్వ భూముల సంక్రమణ (సక్సెషన్) రిజిస్ట్రేషన్ విషయంలో కొంత స్పష్టత రాలేదు. సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ల అర్హతలు, సామర్థ్యం, అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులపై ఉన్న అనేక సందేహాల కారణంగా, ఈ రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తే మంచిదన్న అభిప్రాయానికి అధికారులు వచ్చినట్లు సమాచారం.