BRICS Summit: ప్రధాని మోదీ-జీ జిన్‌పింగ్ భేటీపైనే అందరి దృష్టి
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాకు వెళ్లారు. బ్రిక్స్ సమ్మిట్ ఆగస్టు 22న ప్రారంభమై 24వరకు జరగనుంది. ఈ సదస్సు నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్- మోదీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో అందరి దృష్టి జిన్‌పింగ్- మోదీ భేటీపైనే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ ఇద్దరు నేతల భేటీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రధాని మోదీ, జిన్‌పింగ్ మధ్య సమావేశం గురించి విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాను అడిగినప్పుడు ఆయన ఇలా స్పందించారు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు.
2020 నుంచి మోదీ- జిన్‌పింగ్ మధ్య జర్చలు జరగలేదు
ఒకవేళ మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగితే అది చారిత్రక సమావేశం అవుతుంది. ఎందుకంటే 2020మేలో భారత్ -చైనా సరిహద్దులో చెలరేగిన ప్రతిష్టంభన తర్వాత ఈ ఇద్దరు నేతలు సమావేశం కాలేదు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉప్పు, నిప్పుగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగితే ఇద్దరు ఏ అంశాలపై చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతేడాది నవంబర్‌లో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో ఇచ్చిన జీ20 విందులో ఇరువురు నేతలు కొద్దిసేపు కలుసుకున్నారు. కానీ ఎలాంటి చర్చలు జరపలేదు.