Page Loader
Amarnath Yatra: భారీ వర్షాల కారణంగా జమ్మూ నుంచి అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత‌
భారీ వర్షాల కారణంగా జమ్మూ నుంచి అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత‌

Amarnath Yatra: భారీ వర్షాల కారణంగా జమ్మూ నుంచి అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని జమ్ముకశ్మీర్ సమాచార శాఖ గురువారం ప్రకటించింది. పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కుండపోత వర్షాల కారణంగా యాత్ర మార్గాలు ప్రభావితమైన నేపథ్యంలో, అక్కడ అత్యవసర పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. దీంతో యాత్రను ఒక రోజు పాటు నిలిపివేయాల్సి వచ్చిందని వెల్లడించారు.

వివరాలు 

పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత‌

''గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రెండు మార్గాల్లోని ట్రాక్‌లపై పునరుద్ధరణ పనులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్లే పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశాం'' అని జమ్ముకశ్మీర్ ప్రజా సంబంధాల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురి ఈ యాత్ర నిలిపివేతను ధృవీకరించారు. వాతావరణ పరిస్థితులను బట్టి యాత్రను రేపు మళ్లీ ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వివరాలు 

ఆగస్టు 9తో ముగియనున్న యాత్ర 

''గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ట్రాక్‌లపై అత్యవసర మరమ్మతులు, నిర్వహణ పనులు చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ రోజు రెండు బేస్ క్యాంపుల నుంచి యాత్రను కొనసాగించకూడదని నిర్ణయించాం'' అని ఆయన వివరించారు. ఈ నెల 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రలో ఇప్పటివరకు 2.35 లక్షలకు పైగా యాత్రికులు పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. ఇక, 4 లక్షలకు పైగా భక్తులు యాత్ర కోసం ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని వెల్లడించారు. మొత్తం 38 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర ఆగస్టు 9న ముగియనుంది.