Kamal Nath: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి కమల్‌నాథ్ రాజీనామా?
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి కమల్ నాథ్ రాజీనామా చేయనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను కలిసేందుకు కమల్ నాథ్ మంగళవారం దిల్లీకి వెళ్లినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 230 సీట్లకు గానూ... బీజేపీ 163, కాంగ్రెస్ 66 స్థానాలను గెల్చుకుంది. అంటే.. కాంగ్రెస్ కంటే దాదాపు మూడు రెట్ల సీట్లను బీజేపీ గెల్చుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాహుల్‌గాంధీతో కమల్‌నాథ్ ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం.
కమల్ నాథ్‌పై కాంగ్రెస్ హై కమాండ్ అసంతృప్తి
మధ్యప్రదేశ్ అసంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో కమల్ నాథ్‌పై హైకమాండ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో కమల్ నాథ్ తీసుకున్న ఏక పక్ష నిర్ణయాల వల్లే కాంగ్రెస్ ఓటమిని చవి చూసిందంటూ ఇండియా కూటమిలోని పార్టీలు ఆరోపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో జేడీయూ, ఎస్పీ పార్టీలకు కూడా ఓటు బ్యాంకు ఉంది. ఈ క్రమంలో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవడంపై కమల్ నాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ నాలుగు సీట్లను.. జేడీయూ ఒక సీటను అడగ్గా.. దానికి కమల్ నాథ్ ఒప్పుకోలేదు. దీంతో ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఎస్పీ, జేడీయూ వేర్వేరుగా పోటీ చేశాయి. దీని వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారిగా చీలిపోయి.. కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూసింది.