LOADING...
Amit Shah: అద్వానీ తరువాత.. అత్యధిక కాలం హోంమంత్రిగా అమిత్ షా రికార్డు!
అద్వానీ తరువాత.. అత్యధిక కాలం హోంమంత్రిగా అమిత్ షా రికార్డు!

Amit Shah: అద్వానీ తరువాత.. అత్యధిక కాలం హోంమంత్రిగా అమిత్ షా రికార్డు!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సరికొత్త చరిత్రను నమోదు చేయగా,తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఓ అద్భుతమైన మైలురాయిని సాధించారు. ఈ మధ్యే మోదీ, ఇందిరా గాంధీ తర్వాత దేశంలో అత్యంత కాలం పాటు ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా రికార్డుల్లో నిలిచారు. ఇప్పుడు అదే బాటలో అమిత్ షా కూడా ఆగస్టు 5 నాటికి భారతదేశ చరిత్రలో సుదీర్ఘకాలం హోంమంత్రిగా పనిచేసిన నాయకుడిగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆగస్టు 5నాటికి అమిత్ షా సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో హోంమంత్రి పదవిలో ఎక్కువ కాలం పనిచేసిన రికార్డు బీజేపీ సీనియర్‌ నేత లాల్ కృష్ణ అద్వానీ పేరిట ఉండగా, తాజాగా షా ఆ రికార్డును అధిగమించారు.

వివరాలు 

 అమిత్ షా.. ఆరు సంవత్సరాలు 64 రోజులు హోంమంత్రిగా.. 

అద్వానీతోపాటు కాంగ్రెస్‌ నాయకుడు గోవింద్ వల్లభ్ పంత్ కూడా ఆరు సంవత్సరాలకు పైగా హోంమంత్రిగా సేవలందించారు. మరోవైపు, మోదీ మొదటి ప్రభుత్వ కాలంలో రాజ్‌నాథ్ సింగ్ ఐదేళ్లు హోంమంత్రిగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు అమిత్ షా.. ఆరు సంవత్సరాలు 64 రోజులు హోంమంత్రిగా కొనసాగుతూ, వారిని అధిగమించారు. 2019లో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరుణంలో అమిత్ షా కేంద్ర హోంమంత్రి పదవిని చేపట్టారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఆయనే హోంమంత్రిగా కొనసాగుతున్నారు. మొత్తం మీద ఈ పదవిలో ఆరు సంవత్సరాల 64 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో, అద్వానీ, గోవింద్ వల్లభ్ పంత్ లా సుదీర్ఘకాలం పనిచేసిన హోంమంత్రిగా షా గుర్తింపు పొందారు.

వివరాలు 

ఆర్టికల్ 370ను రద్దు చేయడంలో 'షా' కీలకపాత్ర

హోంమంత్రి హోదాలో అమిత్ షా అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అనంతరం జమ్మూ కాశ్మీర్‌ను లడఖ్‌తో పాటు రెండు ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని ప్రకటించారు. వీటితోపాటు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహణ, దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలు వంటి అనేకమందిని ప్రభావితం చేసిన నిర్ణయాలు అమిత్ షా తీసుకున్నారు.

వివరాలు 

అమిత్ షా నేతృత్వంలో పార్టీ పలు రాష్ట్రాల్లో అద్భుత విజయాలు 

అంతకు ముందు మోడీ కేబినెట్‌లో చేరకముందు, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన నేతృత్వంలో పార్టీ పలు రాష్ట్రాల్లో అద్భుత విజయాలు సాధించింది. ముఖ్యంగా అస్సాం, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రత్యేక ముద్ర వేశారు. 2017లో, దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన్ను ప్రధాన వ్యూహకర్తగా గుర్తించాలి. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో గెలుపొందగా, అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి, రాజ్‌నాథ్ సింగ్ స్థానాన్ని భర్తీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు హోంమంత్రిగా తానే కొనసాగుతున్నారు.