Loading...
Andhra Pradesh: ఏపీలో బీభత్సం సృష్టించిన వాయుగుండం.. 16 జిల్లాల్లో తీవ్ర ప్రభావం
ఏపీలో బీభత్సం సృష్టించిన వాయుగుండం.. 16 జిల్లాల్లో తీవ్ర ప్రభావం

Andhra Pradesh: ఏపీలో బీభత్సం సృష్టించిన వాయుగుండం.. 16 జిల్లాల్లో తీవ్ర ప్రభావం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2026
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. కళింగపట్నం సమీపంలో బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున ఒంటి గంట మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటింది. దీంతో ఉత్తరాంధ్రతో పాటు ఎన్టీఆర్‌ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు అనేక మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. 16 జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించింది. పలుచోట్ల వాగులు, నదులు ఉద్ధృతంగా ప్రవహించడంతో వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులు దెబ్బతినడంతో పాటు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

వివరాలు 

విశాఖపట్నంలో కుండపోత

బుధవారం రాత్రి నుంచి విశాఖపట్టణం నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా గంటల తరబడి వర్షం కురిసింది.

బుధవారం ఉదయం 8.30గంటల నుంచి గురువారం ఉదయం 8.30గంటల వరకు అత్యధికంగా విశాఖపట్నం జిల్లా ఎండాడలో 277.9మి.మీ. వర్షపాతం నమోదైంది.

సింహాచలం మెట్ల మార్గం జలపాతాన్ని తలపించేలా మారింది.

పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఆయిల్‌ టెర్మినల్‌లోకి వరద నీరు చేరింది.

నగరంలో పలుచోట్ల కొండచరియలు, రక్షణ గోడలు కూలిపోయాయి. చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి.

రహదారులు, మైదాన ప్రాంతాలు చెరువులను తలపించాయి.

జీవీఎంసీ పరిధిలో వందేళ్ల నాటి మర్రిచెట్టుతో కలిపి మొత్తం 71 చెట్లు పడిపోయాయి. పలుచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. 14 కాలనీల్లో వరద నీరు నిలిచింది.

వివరాలు 

విశాఖపట్నంలో కుండపోత

కొమ్మాది ప్రాంతంలోని రాకాన్‌ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లోకి భారీగా వర్షపు నీరు చేరింది.

దీంతో అక్కడ నివసిస్తున్న 71మందిని అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్డీఆర్‌ఎఫ్‌,అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

పక్కనే ఉన్న మరో ఇంట్లోకి కూడా నీరు చేరడంతో అక్కడున్న వారినీ రక్షించారు.

6వ వార్డు హౌసింగ్‌ బోర్డు కాలనీ సమీపంలోని విజయనగరం టీచర్స్‌ లేఅవుట్‌లో అపార్ట్‌మెంట్‌ గోడ కూలడంతో మురుగునీరు సెల్లార్‌లోకి చేరింది.

అక్కడ నివసిస్తున్న 15కుటుంబాలను సహాయక బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి.

సీతమ్మధార కొండవాలులో భారీ బండరాళ్లు జారిపడ్డాయి. గోపాలపట్నంలోని లక్ష్మీనగర్‌ బ్లాక్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి.

ADVERTISEMENT

వివరాలు 

కళింగపట్నానికి నైరుతి దిశలో తీరం దాటిన వాయుగుండం  

చింతల అగ్రహారం రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద వర్షపు నీరు నిలవడంతో రాకపోకలు ఆగిపోయాయి. 11వ వార్డు దుర్గాలమ్మ గుడి వద్ద జీవీఎంసీ కల్యాణ మండపం రక్షణ గోడ కూలిపోయింది.

తీవ్ర వాయుగుండం కళింగపట్నానికి నైరుతి దిశలో తీరం దాటినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు.

తీరం దాటే సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో వాయుగుండం కదలిక వేగం తగ్గింది.

సముద్రం నుంచి భూభాగంలోకి రావడానికి ఎక్కువ సమయం పట్టింది.

దీంతో సముద్రంపై ఏర్పడిన మేఘాలు ఉత్తరాంధ్ర జిల్లాల వైపు ఎక్కువగా కదిలి భారీ వర్షాలకు కారణమయ్యాయని నిపుణులు వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

భారీ వర్షపాతం నమోదు

బుధవారం ఉదయం 8.30గంటల నుంచి గురువారం ఉదయం 8.30గంటల మధ్య విశాఖపట్నం జిల్లా ఎండాడలో 277.9మి.మీ., విజయనగరం జిల్లా కొత్తవలసలో 193.1,పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 186.8,కృష్ణా జిల్లా గన్నవరంలో 173.2,కాకినాడ జిల్లా సామర్లకోటలో 171.2,శ్రీకాకుళం జిల్లా కోవిలంలో 166.9,డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 158.0మి.మీ. వర్షపాతం నమోదైంది.

ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.

గురువారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పార్వతీపురం మన్యం జిల్లా చిలకపల్లెలో 109.25 మి.మీ., రాజమహేంద్రవరంలో 106, కాకినాడలో 71.75, విజయనగరం జిల్లా బొబ్బిలిలో 70.31, ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరులో 64.75, పోలవరం జిల్లా దేవీపట్నంలో 60.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.

వివరాలు 

నదులకు భారీగా వరద

వంశధార నదికి 34 వేల క్యూసెక్కులు, బహుదా నదికి 23 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది.

నాగావళి నదికి 23 వేల క్యూసెక్కుల వరకు వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

విజయవాడ సమీపంలోని బుడమేరు కూడా వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహించింది.

ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తారు.

వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు తీగలు తగిలి ఐదుగురు మృతి చెందారు. గోడ కూలడంతో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలంలోని కొండవాగులో నీటి ఉద్ధృతికి బలిజ సుబ్బమ్మ (70) గల్లంతయ్యారు.

మరోవైపు ఉమ్మడి గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కురిసిన వర్షాలు పంటలకు అనుకూలంగా మారాయి.

వివరాలు 

అల్లూరి జిల్లాలో వంతెనలు, రహదారులకు నష్టం

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలంలోని డి.అగ్రహారం వంతెనపై వరద నీరు ప్రవహించడంతో దారకొండ-గుమ్మిరేవుల మార్గంలో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

గొల్లపల్లి-చామగెడ్డ మధ్య వంతెన కొట్టుకుపోవడంతో వంచుల, అమ్మవారి దారకొండ పంచాయతీల పరిధిలోని 15 గ్రామాలు రహదారి సంబంధాలు కోల్పోయాయి.

చింతపల్లి మండలంలోని చౌడుపల్లి-పశువుబంద చెరువుకు గండిపడటంతో రహదారిపై భారీగా నీరు చేరింది.

ఎన్‌హెచ్‌-516ఈ చింతాలమ్మ ఘాట్‌ రోడ్డులో, జీకేవీధి మండలంలోని పెదవలస-చాపరాతిపాలెం మధ్య జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి.

వివరాలు 

అల్లూరి జిల్లాలో వంతెనలు, రహదారులకు నష్టం

పెదబయలు మండలంలోని జడిగూడ-చింతలవీధి మధ్య పెద్దగెడ్డ ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఇటీవల నిర్మించిన రాయగడ వంతెన వద్ద అప్రోచ్‌ రోడ్డు సుమారు పది అడుగుల మేర కుంగిపోయింది.

జీకేవీధి మండలంలోని పెదవలస ప్రాంతంలో మూడు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

చింతపల్లి మండలంలోని చౌడేపల్లి సమీపంలో చెరువు నీరు పొంగడంతో చింతపల్లి-జర్రెల ప్రధాన రహదారిపై వరద ప్రవహించింది.

దీంతో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వివరాలు 

శ్రీకాకుళంలో పంటలకు భారీ నష్టం

శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి అనుసంధాన కాలువకు ఎల్‌ఎన్‌పేట మండలం కవిటి వద్ద భారీ గండి పడింది.

దీంతో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. జిల్లాలోని పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

సుమారు 8 వేల హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్లు అంచనా. 630 హెక్టార్లలో అరటి, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లింది.

మహేంద్రతనయ కాజ్‌వే పూర్తిగా నీట మునగడంతో పాతపట్నం-గుణుపుర్‌ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

వజ్రపుకొత్తూరు మండలం శివరాంపురం వద్ద ఉప్పుటేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు.

ఈదురుగాలులకు జిల్లాలో 280 విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. తీగలు తెగిపోవడంతో పాటు 34 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. సుమారు రూ.50 లక్షల నష్టం జరిగినట్లు అంచనా.

వివరాలు 

కృష్ణా జిల్లాలో పొంగిన వాగులు

పదుల సంఖ్యలో గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. 83 ఇళ్లు దెబ్బతిన్నాయి.

ఎడతెరిపిలేని వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద ప్రవాహం తోడవడంతో బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌లో భారీగా నీరు చేరింది.

నందిగామ మండలం దాములూరు వద్ద వైరా ఏరు రహదారిపై ఉద్ధృతంగా ప్రవహించడంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

తిరువూరు మండలంలో 70 ఇళ్లు దెబ్బతిన్నాయి. విజయవాడలో పలుచోట్ల డ్రెయిన్లు పొంగిపోయాయి.

గంపలగూడెం మండలం వినగడప సమీపంలో కట్టలేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో విజయవాడ, నూజివీడు, మైలవరం నియోజకవర్గాల్లోని 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

మచిలీపట్నం, గుడివాడ బస్టాండ్లలోకి నీరు చేరడంతో మోటార్ల సహాయంతో నీటిని బయటకు తోడారు.

వివరాలు 

కోనసీమలో పంటలు నీట మునక

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 136 విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి.

ఏడు మండలాల పరిధిలో 1,842 ఎకరాల వరి పంట నీట మునిగింది. కాకినాడలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ పరిసరాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది.

జిల్లాలో 1,885 ఎకరాల్లో వరి, 16.5 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఏలూరు, పోలవరం ప్రాంతాల్లోనూ వర్షాల ప్రభావం కనిపించింది.

విద్యుత్తు తీగలు తెగిపోవడంతో పాటు స్తంభాలు ఒరిగిపోయాయి. పలు చోట్ల వాగులు పొంగడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వివరాలు 

రాజమహేంద్రవరంలో రోడ్లు జలమయం

రాజమహేంద్రవరంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డు, ఆర్యాపురం, హైటెక్‌ బస్టాండ్‌, కంబాలచెరువు మార్గం తదితర ప్రధాన ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి.

కొన్ని ప్రాంతాల్లో నడుము లోతు నీరు చేరడంతో బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది.

పలుచోట్ల భారీ చెట్లు నేలకొరిగాయి. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో సుమారు 60 విద్యుత్తు స్తంభాలు పడిపోయాయి.

పోలవరం జిల్లాలో కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాజవొమ్మంగి, దేవీపట్నం, రంపచోడవరం, వై.రామవరం మండలాల్లో రహదారులపైకి భారీగా నీరు చేరింది.

చింతూరు మండల పరిధిలో ఎన్‌హెచ్‌-326పైకి వరద నీరు రావడంతో ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

వివరాలు 

ఇతర జిల్లాల్లోనూ నష్టం

పశ్చిమగోదావరి జిల్లాలో 378 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. తాడేపల్లిగూడెం మండలం మాధవవరం వద్ద ఎర్రకాలువ ఉద్ధృతి పెరిగింది.

విజయనగరం జిల్లా గరివిడి మండలం వి.పి.రేగ కాజ్‌వేపై చిట్టిగెడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో అక్కడ రాకపోకలు నిలిపివేశారు.

చీపురుపల్లి, గరివిడి మండలాల్లో 103 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మునగ పంటలకు నష్టం వాటిల్లింది.

పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట మండలం నూకలవాడ గ్రామంలోకి వరద నీరు చేరింది. జీఎంవలస మండలంలో 40 నుంచి 50 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి.

వివరాలు 

రెండు రోజుల పాటు వర్షాలు

శుక్ర, శనివారాల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

శుక్రవారం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అక్కడక్కడా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.

ADVERTISEMENT