ఆంధ్రప్రదేశ్: గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష తేదీని ప్రకటించిన ఏపీపీఎస్సీ
గ్రూప్ 4 స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తీపికబురు చెప్పింది. మెయిన్స్ పరీక్షకు సంబంధించిన తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఇప్పటికే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే స్క్రీనింగ్ పరీక్షను కూడా నిర్వహించింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టు కోసం ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్ పరీక్షను 2022 జూలై 31న నిర్వహించింది.
ఈ నెల 24వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్ లోడ్
ఏప్రిల్ 4వ తేదీ నుంచి గ్రూప్ 4 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ పేర్కొంది. జిల్లాల కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ వెల్లడించింది. www.psc.ap.gov.in వెబ్ సైట్లో పరీక్షలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చని చెప్పింది. అలాగే ఈ పరీక్షలను ఏపీపీఎస్సీ చాలా పకడ్బందీగా నిర్వహించనుంది. కంప్యూటర్ బేస్డే పరీక్షలను నిర్వహించనుంది. స్క్రీనింగ్ పరీక్షను 2,11, 341 మంది రాయగా, మెయిన్స్‌కు 11, 574 మంది ఎంపికైనట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది