Page Loader
AP Budget: నవంబర్ లో ఏపీ బడ్జెట్ సమావేశాలు..'సూపర్‌ సిక్స్‌'పై కసరత్తు
నవంబర్ లో ఏపీ బడ్జెట్ సమావేశాలు..'సూపర్‌ సిక్స్‌'పై కసరత్తు

AP Budget: నవంబర్ లో ఏపీ బడ్జెట్ సమావేశాలు..'సూపర్‌ సిక్స్‌'పై కసరత్తు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 18, 2024
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి స్థాయి బడ్జెట్‌ను నవంబరు రెండో వారంలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ రూపకల్పనలో పూర్తిగా తలమునకలై ఉండగా, శాసనసభ, ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసే పనిలో ఉన్నారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆర్థిక శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు తేదీలు ప్రతిపాదనకు వచ్చాయి.

వివరాలు 

విస్తృత బడ్జెట్ ప్రక్రియ 

రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా జగన్ ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను సమర్పించింది. మొత్తం రూ.2,86,389 కోట్లకు బడ్జెట్ సమర్పించారు. 2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి 40 గ్రాంట్ల కింద రూ.1,09,052.34 కోట్లకు శాసనసభ ఆమోదం తీసుకుంది. జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉంది. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, అప్పుల అంశాలపై స్పష్టత లేకపోవడం వల్ల మరోసారి ఓటాన్ ఎకౌంట్ రూపంలో ఆర్డినెన్సును ఆమోదం తీసుకున్నారు.

వివరాలు 

వెచ్చిన ఖర్చులు 

ఆగస్టు నుంచి నవంబరు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుల కోసం రూ.1,29,972.97 కోట్లతో 40 గ్రాంట్ల కింద రెండో తాత్కాలిక బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తీసుకున్నారు. ఈ మొత్తం కాలంలో, మొత్తం 8 నెలల కాలం ఓటాన్ ఎకౌంట్ పద్ధతిని ఉపయోగించారు. ఈ నేపథ్యంలో నవంబరు రెండో వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమానికి అదనపు కేటాయింపులు ఎన్నికల్లో ఎన్డీయే కూటమి "సూపర్ సిక్స్" పేరుతో ప్రజలకు భారీ సంక్షేమ పథకాల అమలు హామీ ఇచ్చింది. వృద్ధాప్య,ఇతర పెన్షన్ మొత్తాలను పెంచి ఇప్పటికే అమలు చేస్తున్నారు.ఇక మిగిలిన సంక్షేమ పథకాల అమలుపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.

వివరాలు 

సంక్షేమ పథకాల అమలు 

జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల ఖర్చుతో పోల్చితే,ఇంకా రూ.20 వేల కోట్ల అదనపు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.నవంబరు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలు కాబోతోంది. రాబోయే నాలుగు నెలల్లో ఏ పథకం ఎలా అమలు చేయబడుతుందో, బడ్జెట్‌లో రూపురేఖలు వెల్లడిస్తారు. పథకాల విధివిధానాలు, లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా అంచనా వ్యయాలు రూపొందించారు. నిరుద్యోగ భృతి ఖర్చులు ఇంకా కొనసాగినా, ఉపాధి కల్పనతో భారం తగ్గుతుందనే అంచనాలో ఉన్నారు. సంక్షేమ పథకాలను ఒకొక్కటిగా అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు.

వివరాలు 

రూ.2.90 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్! 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రకటించనుంది.సాధారణంగా చివరి నాలుగు నెలల ఖర్చులకు మాత్రమే బడ్జెట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ, ఈసారి ప్రభుత్వం మొత్తం ఏడాది కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రధానంగా అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు: ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్‌కు పెద్దపీట వేయనున్నారు. అమరావతిలో మౌలిక సదుపాయాల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావలసిన నిధులను భారీగా కేటాయించనున్నారు.

వివరాలు 

రహదారుల అభివృద్ధి కీలకం

రహదారుల నిర్మాణం, మరమ్మతులు కూడా కీలక అంశంగా నిలిచాయి.రహదారుల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించనున్నారు,తద్వారా రాష్ట్రంలోని రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఈ చర్యలు తీసుకోనున్నారు. కేంద్రం నుంచి నిధులు రాష్ట్రానికి కేటాయించబడిన కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వివిధ ప్రాజెక్టులకు నిధులు కేటాయించనున్నారు. సుమారు 28 పథకాల కింద కేంద్రం,రాష్ట్రం కలిసి నిధులు సమకూరుస్తూ వివిధ అభివృద్ధి పనులు చేయబోతున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు,ఆర్థిక శాఖ కార్యదర్శి చర్చలు ప్రస్తుతం ఆర్థికశాఖ కార్యదర్శి వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చలు కొనసాగిస్తున్నారు.ఈ ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత,మంత్రులతో సమావేశాలు నిర్వహించి, తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.ఇది రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో మరో కీలకమైన అడుగు అవుతుందని ప్రభుత్వం ఆశిస్తున్నది.