CBN Tributes to Tata: రతన్ టాటా మృతికి ఏపీ క్యాబినెట్ సంతాపం.. ముంబై బయలుదేరిన చంద్రబాబు, లోకేష్
ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ ముగిసింది. అజెండా అంశాలపై చర్చను క్యాబినెట్ వాయిదా వేసింది. రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించింది. భేటీకి ముందు ఆయన చిత్రపటం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నివాళి అర్పించారు. భారత పారిశ్రామిక రంగానికి దిశ దిశ చూపించి, నవతరం పారిశ్రామిక వేత్తలకు ఆదర్శప్రాయులైన గొప్ప వ్యక్తి రతన్ టాటా అని ఏపీ క్యాబినెట్ మంత్రులు కొనియాడారు. పారిశ్రామిక రంగానికి మానవత్వం జోడించి, పేద ప్రజల సంక్షేమాన్ని ఆలోచించిన మానవతావాది రతన్ టాటా అని కీర్తించారు. దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆజన్మాంతం ఆచరించిన మహనీయుడని పేర్కొన్నారు.
తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించిన రతన్ టాటా
కోట్ల మంది ప్రజల హృదయాల్లో రతన్ టాటా జీవించే ఉంటారని ఏపీ మంత్రులు కొనియాడారు. కార్పొరేట్ రంగంలో వృద్ధి చెందుతూనే సామాన్యుల సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ఆకాంక్షించిన మహోన్నత మానవతా వాదిగా కీర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా, నాడు హైదరాబాద్‌లో చంద్రబాబు కృషితో TCS ఏర్పాటు చేసి ఎంతో మంది యువతకు మంచి భవిష్యత్తు అందించారని మంత్రులు గుర్తు చేసుకున్నారు. తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించిన రతన్ టాటా, విపత్తు సమయాల్లో కూడా మన రాష్ట్రానికి ఎంతో మేలు చేశారని మంత్రి అచ్చన్నాయుడు గుర్తు చేసుకున్నారు.
సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు
చంద్రబాబు అభ్యర్థన మేరకు విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని టాటా గ్రూప్ నిన్ననే ప్రకటించిందని, కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిన రతన్ టాటా మంచి మనస్సున్న స్ఫూర్తిదాయక పారిశ్రామికవేత్తగా మంత్రులు కొనియాడారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ముంబయికి బయలుదేరనున్నారు. రతన్ టాటా పార్థివ దేహానికి వారు నివాళులర్పించనున్నారు. ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లో రతన్ టాటా పార్థివ దేహాన్ని ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.