Page Loader
Metro Rail: విజయవాడ,విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టులపై సమీక్ష..ఈ రూట్‌లలోనే, ప్రభుత్వం కీలక ప్రకటన 
విజయవాడ,విశాఖపట్టణం మెట్రో రైలు

Metro Rail: విజయవాడ,విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టులపై సమీక్ష..ఈ రూట్‌లలోనే, ప్రభుత్వం కీలక ప్రకటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2024
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అటకెక్కిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు నిర్ణయించారు. ఈ ప్రణాళికలో భాగంగా,అమరావతి నిర్మాణ పనులను డిసెంబరు నుండి ప్రారంభించనున్నారు. అదనంగా, విజయవాడ-గంటూరు నగరాలను అమరావతి రాజధానిపై నిర్మించే మెట్రో రైల్ మార్గం, విశాఖపట్టణంలో మెట్రో ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. గత వైకాపా ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులను పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం, సీఎం చంద్రబాబు నాయుడు ఈ రెండు ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించి.. డీపీఆర్‌లను కేంద్రానికి పంపాలని ఆదేశించారు. సవరించిన డీపీఆర్ ప్రకారం, విజయవాడ-అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టుకు రూ. 25,130 కోట్లు, విశాఖపట్టణం మెట్రో ప్రాజెక్టుకు రూ. 17,232 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

వివరాలు 

రెండు దశల్లో విజయవాడ-అమరావతి మెట్రో మార్గం

విజయవాడ-అమరావతి మెట్రో మార్గం మొత్తం పొడవు 66.20 కిలోమీటర్లు. దీన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. మొదటి దశలో 38.40 కిలోమీటర్లు నిర్మించే అవకాశం ఉంది, దీనికి రూ. 11,009 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ మార్గం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు 25.95 కిలోమీటర్లు, బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.45 కిలోమీటర్లు ఉంటుంది. రెండో దశలో 27.80 కిలోమీటర్లు నిర్మిస్తారు.దీనికి రూ. 14,121 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

వివరాలు 

విశాఖ మెట్రో తొలిదశ ప్రాజెక్టు పనులు నాలుగేళ్లలో పూర్తి చేయాలి: చంద్రబాబు

ఈ ప్రాజెక్టుపై ఏపీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.."పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రాజధాని అమరావతికి 27.80 కిలోమీటర్ల మార్గం నిర్మాణానికి కేంద్రం నిధులు అందించాలని కోరారు. 2019కి ముందు ఈ ప్రాజెక్టులపై అనేక కసరత్తులు చేసి, కేంద్రానికి ఆమోదానికి పంపించాం. కొత్త పాలసీ ఆధారంగా, మళ్లీ దరఖాస్తు చేయాలని కేంద్రం సూచించింది. వైకాపా ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. సవరించిన అంచనాలు,డీపీఆర్లను కేంద్రానికి పంపుతున్నాం" అని ఆయన తెలిపారు. విశాఖ మెట్రో తొలిదశ ప్రాజెక్టు పనులను నాలుగేళ్లలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్టు ఆయన తెలిపారు.