AP Budget 2025: ఏపీ బడ్జెట్‌లో తల్లికి వందనంపై క్లారిటీ.. బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయింపు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విద్య రంగానికి భారీగా నిధులు కేటాయించారు.
తల్లికి వందనం పథకం గురించి శుభవార్తను వెల్లడించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడమే మంత్రి నారా లోకేశ్ ప్రధాన లక్ష్యమని, ఆయన దీని బాధ్యతను తన భుజాలపై తీసుకున్నారని పేర్కొన్నారు.
"నేటి బాలలే రేపటి పౌరులు" అనే ఆలోచనతో విద్యా రంగంలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని, ఫలితాల ఆధారిత విద్యపై దృష్టి పెట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీలను పాఠ్యాంశాల్లోకి తీసుకురావడం ద్వారా విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారని తెలిపారు.
వివరాలు
"తల్లికి వందనం"కి రూ.9,407 కోట్లు
విద్యను తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
ఏ ఒక్క పిల్లవాడు కూడా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో "తల్లికి వందనం" పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.
ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికి ఈ పథకం ద్వారా మద్దతునిచ్చేందుకు తగినన్ని నిధులు కేటాయించామని పేర్కొన్నారు.
ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లలకు వర్తించనుంది. ఇందుకోసం రూ.9,407 కోట్లు కేటాయించామని తెలిపారు.
వివరాలు
విద్యాశాఖకు రూ.31,805 కోట్లు
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం కింద 35.69 లక్షల విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫార్మ్‌లు అందిస్తామని మంత్రి వివరించారు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని, అందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
వివరాలు
మే నెలలో "తల్లికి వందనం" అమలు
విద్యార్థులను భవిష్యత్ సవాళ్లకు సిద్ధం చేయడం, అందరికీ సమాన అవకాశాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కీలక సంస్కరణలు తీసుకువచ్చామని, 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉన్నత విద్యాశాఖకు రూ.2,506 కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు.
"తల్లికి వందనం" పథకానికి బడ్జెట్ కేటాయింపులు పూర్తయ్యాయని, మే నెలలో దీని అమలు ప్రారంభమవుతుందని తెలిపారు.