
AP: ఏపీ క్రీడాకారులకు కూటమి ప్రభుత్వ శుభవార్త .. రూ.8 కోట్లు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ రాష్ట్రంలోని క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది.
వారు సాధించిన ఘన విజయాలకు గానూ ప్రకటించిన ప్రోత్సాహక నిధులను విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.
గతంలోనే ప్రోత్సాహకాలు ప్రకటించినప్పటికీ, నిధుల విడుదల మాత్రం జరగలేదు.
ఈ నిధుల మంజూరు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండగా, క్రీడాశాఖ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి, ఏపీ శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు.
వివరాలు
క్రీడా ప్రోత్సాహక నిధుల విడుదల
గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించినప్పటికీ, అవి అమలుకాలేదు.
ఈ నేపథ్యంలో క్రీడాకారులకు న్యాయం చేయాలని మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి,శాప్ ఛైర్మన్ రవి నాయుడు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.
దాంతో,తాజాగా ఏపీ ప్రభుత్వం క్రీడా ప్రోత్సాహక నిధులను విడుదల చేసింది.
ఈ సందర్భంగా అమరావతిలో విలేకరులతో మాట్లాడిన శాప్ ఛైర్మన్ రవి నాయుడు,గత వైసీపీ ప్రభుత్వ కాలంలో రూ.11,68,62,288 విలువైన క్రీడా ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ఈ నిధుల విడుదల లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 224 మంది క్రీడాకారులు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారని వెల్లడించారు.
తాజాగా,అందులో 189 మంది క్రీడాకారులకు రూ.7,96,62,289 నిధులను కూటమి ప్రభుత్వం గురువారం విడుదల చేసిందని పేర్కొన్నారు.
వివరాలు
"ఆడుదాం ఆంధ్ర"లో భారీ స్థాయిలో అవినీతి
ప్రోత్సాహకాలు విడుదల చేసినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్‌కు శాప్ ఛైర్మన్ రవి నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు.
క్రీడాకారులకు నిధులు అందించడం పట్ల క్రీడా సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడాకారులకు ఎటువంటి ప్రోత్సాహకాలు అందలేదని రవి నాయుడు గుర్తుచేశారు.
వందలాది మంది క్రీడాకారులు ఆర్థిక ఇబ్బందులతో కష్టాలు అనుభవించారని చెప్పారు.
జగన్ సర్కార్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు "ఆడుదాం ఆంధ్ర" పేరుతో ప్రత్యేక క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించిందని, దీనికి భారీ నిధులు కేటాయించినప్పటికీ, ఈ కార్యక్రమం విజయవంతం కాలేదని తెలిపారు.
అంతేకాదు, ఇందులో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలు వచ్చాయని రవి నాయుడు వివరించారు.