Andhra Pradesh New Railway Line: ఏపీలో మరో కొత్త రైల్వే లైనుకు శ్రీకారం.. కొవ్వూరు-భద్రాచలం రోడ్డు కొత్త మార్గం
ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం ప్రగతి దిశగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న నిధుల సహాయంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అనేక సంవత్సరాలుగా నిరాకరించబడిన ప్రాజెక్టులు ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా, గత 60 ఏళ్లుగా కేవలం పేపర్లలో మాత్రమే ఉన్న కొవ్వూరు-భద్రాచలం రోడ్డు రైల్వే లైన్ ప్రస్తుతం పట్టాలెక్కబోతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఈ ప్రాజెక్టు త్వరలోనే పూర్తి కావచ్చునని భావిస్తున్నారు.
గ్రీన్‌ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే మార్గం
కొవ్వూరు-భద్రాచలం రోడ్డు రైల్వే లైన్ నిర్మాణం జరిగితే, జిల్లాలోని మెట్ట మండలాలకు రైలు ప్రయాణం సౌకర్యం చేరువ అవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా ఈ రైల్వే మార్గం నిర్మించబడే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ రైల్వే మార్గం తల్లాడ-దేవరపల్లి హైవేకి అనుసంధానంగా వెళ్లాలని కోరుతోంది. ఈ మార్గం గ్రీన్‌ఫీల్డ్ హైవే వైపు అయితే చింతలపూడి, టి.నరసాపురం మండలాలకు రైలు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. మిగిలిన జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం మండలాలకు ఎక్కడ నుంచి లైను నిర్మించినా రైల్వే మార్గం సమీపంలో ఉంటుంది.
ఈ లైను ద్వారా బొగ్గు రవాణా
గతంలో ఈ లైనును భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్ నుండి కొవ్వూరు వరకు నిర్మించాలనే ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం కొత్తగూడెం నుండి సత్తుపల్లి వరకు సింగరేణి, దక్షిణ మధ్య రైల్వేలు కలిసి లైన్ నిర్మాణం పూర్తి చేసాయి. అలాగే, సత్తుపల్లి నుండి కొత్తగూడేని ఈ లైన్ ద్వారా బొగ్గు రవాణా జరుగుతోంది. అందుకే ఈ కొత్త రైల్వే మార్గాన్ని సత్తుపల్లి నుండి చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల మీదుగా కొవ్వూరుకు వేయాలని యోచిస్తున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం, సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల మీదుగా లైన్ ఉంటుంది.
60 ఏళ్ల కల
హైదరాబాద్ నుండి విశాఖపట్టణం వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న విజయవాడ లైనుకు ప్రత్యామ్నాయంగా, రైల్వేశాఖ గ్రీన్‌ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా ఈ కొత్త లైన్ నిర్మించడానికి ప్లాన్ చేస్తోందని సమాచారం అందింది. ఈ రైలు మార్గం ద్వారా హైదరాబాద్-విశాఖ మధ్య 90 కిమీ దూరం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భద్రాచలం రోడ్డు-కొవ్వూరు కొత్త రైల్వే లైన్ ఎటువైపు నిర్మించినా, జిల్లా మీదుగా వెళ్లడం తప్పనిసరి అవుతుందని అంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరో రైల్వే లైన్ ఏర్పడడం ఖాయమని పలు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఈ ప్రాంత ప్రజల 60 ఏళ్ల కల నెరివేరినట్లే. త్వరలో ఈ కొత్త మార్గంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.