Page Loader
Andhra News: రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న సీ ప్లేన్‌ సేవలు.. డీపీఆర్‌ల తయారీకి అనుమతులు
రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న సీ ప్లేన్‌ సేవలు.. డీపీఆర్‌ల తయారీకి అనుమతులు

Andhra News: రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న సీ ప్లేన్‌ సేవలు.. డీపీఆర్‌ల తయారీకి అనుమతులు

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

విమానాశ్రయంలో రన్‌వేపై నుంచి వేగంగా పరుగెత్తి,ఆపై దూరంలోని జలాశయం వద్ద నీటిపై తేలుతూ ఆకాశంలోకి మళ్లీ ఎగిరిపోతూ ప్రయాణికులను ఆకట్టుకునే సీ ప్లేన్‌ సర్వీసులు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి. పర్యాటక అభివృద్ధికి బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సేవల కోసం రాష్ట్రంలోని 11 ప్రదేశాలను ఎంపిక చేసింది. ఈ లొకేషన్లలో ఎనిమిది ప్రాంతాలకుగాను టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీ(సాంకేతిక సాధ్యతా నివేదిక), డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్‌)తయారీ కోసం టెండర్లను ఆహ్వానించారు. మొదటి దశగా ప్రకాశం బ్యారేజి (అమరావతి),కళ్యాణి డ్యాం(తిరుపతి),గండికోటల నుంచి సేవలు ప్రారంభించేందుకు డీపీఆర్‌లు రూపొందించాలని నిర్ణయించారు. ఇందులో అమరావతి,గండికోట ప్రాంతాల డీపీఆర్‌ల బాధ్యత రైట్స్‌ సంస్థకు అప్పగించగా,తిరుపతి ప్రాంతానికి సంబంధించిన బాధ్యతలు ఫీడ్‌బ్యాక్‌ హైవేస్‌ సంస్థకు అప్పగించారు.

వివరాలు 

దేశవ్యాప్తంగా 56 మార్గాల్లో సీ ప్లేన్‌ సేవలు

ఈ ప్రదేశాల నుంచి సేవలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపిన సంస్థలతో అధికారులు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 56 మార్గాల్లో సీ ప్లేన్‌ సేవలు కల్పించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (మోకా - MoCA) బిడ్లను ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపికైన 11 లొకేషన్లలో కొన్ని ప్రాంతాలకు ఒక్కటిపైగా దారులుండటంతో మొత్తం 32 మార్గాలను గుర్తించారు. ఉదాహరణకు ప్రకాశం బ్యారేజి,గండికోట,తిరుపతి లొకేషన్లను బేస్‌గా తీసుకొని,రాకపోకలతో కలిపి ఆరు మార్గాలుగా లెక్కించారు. ఈ సేవల నిర్వహణపై స్పైస్‌జెట్,ఎయిర్‌ ఏషియా వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ఆసక్తి చూపాయి. ప్రస్తుతం ఈ మార్గాల కేటాయింపు కోసం కేంద్రం పరిశీలనలు చేపట్టింది.

వివరాలు 

మొదట్లో మూడు మార్గాలకే ఎందుకు ప్రాధాన్యం? 

యుడాన్‌ (UDAN) పథకం కింద ఉండే సబ్సిడీలు,ఇతర సౌకర్యాలు కూడా ఈ సీ ప్లేన్‌ సేవలకూ వర్తించనున్నాయి. ప్రభుత్వం తొలి దశలో ప్రారంభించబోయే మూడు మార్గాల పరిసరాల్లోనే ఇప్పటికే విమానాశ్రయాలు ఉన్నందున, సాంప్రదాయ విమానాల సేవలతోపాటు సీ ప్లేన్‌ ప్రయాణాలను కూడా కలిపి అమలు చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు, గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాణికులను ప్రకాశం బ్యారేజి వద్ద ఏర్పాటు చేయనున్న వాటర్ డ్రోమ్‌కు తీసుకెళ్లేలా సర్వీసు నడిపే యోచన ఉంది. అక్కడ ప్రయాణికులు కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత శ్రీశైలానికి వెళ్లేలా సదుపాయం కల్పించనున్నారు.

వివరాలు 

ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు: 

మారుమూల ప్రాంతాలకు విమాన సేవలను విస్తరించడం రన్‌వేలు లేని ప్రాంతాల్లో విమానయాన సౌకర్యాలను మెరుగుపరచడం విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన ఖర్చుతో పోలిస్తే తక్కువ వ్యయంతో, తక్కువ సమయంలో వాటర్‌ డ్రోమ్‌లు అభివృద్ధి చేసే అవకాశం పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడం

వివరాలు 

విజయవంతమైన ప్రయోగాత్మక ప్రయాణం

గత ఏడాది నవంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం బ్యారేజి వద్ద పున్నమి ఘాట్‌ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్‌ను ప్రయోగాత్మకంగా నడిపించింది. దాదాపు 150 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు,పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్రంలో సేవల ప్రారంభానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సీ ప్లేన్‌ భూమికి సుమారు 1,500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో ప్రకృతి అందాలను దగ్గరగా ఆస్వాదించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.