Tirupati: తిరుపతి మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్‌పై రోగి దాడి.. జట్టు పట్టుకుని వెనుక నుండి..
వైద్యుల భద్రతపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS)లో మహిళా జూనియర్ డాక్టర్‌పై ఓ రోగి దాడి చేశాడు. రోగి డాక్టర్ జుట్టును హింసాత్మకంగా లాగి మంచానికి ఆమె తలని కొట్టాడు. ఈ దారుణ ఘటన ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనపై వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అనూహ్యంగా ఆమెపై దాడి
ఈ ఘటనపై మహిళా వైద్యురాలు వైద్య కళాశాల వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్‌వీ కుమార్‌కు రాసిన తన ఫిర్యాదు లేఖలో జరిగిన సంఘటనను వివరించింది. శనివారం, ఆమె ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు, బంగారు రాజు అనే పేషెంట్ అనూహ్యంగా ఆమెపై వెనుక నుంచి దాడి చేశాడు. అతను ఆమె జుట్టును పట్టుకుని, ఆమె తలను మంచంలోని స్టీల్ రాడ్‌కి బలంగా కొట్టాడు. ఆమె తనను తాను రక్షించడానికి ప్రయత్నించినా, ఆమెకు గాయాలయ్యాయి. ఆ సమయంలో భద్రత అందుబాటులో లేదు. వెంటనే, చుట్టుపక్కల ఉన్న ఆమె తోటి వైద్యులు ఆమెను రక్షించారు.