Andhrapadesh: రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం.. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం మంత్రివర్గ సమావేశంలో సంబంధిత దస్త్రాన్ని ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం పై తీర్మానం చేయడానికి, కేంద్రానికి నివేదించడానికి ప్రణాళికలు ఉన్నాయి. 2014-19 మధ్య అమలైన ఎన్టీఆర్ విదేశీవిద్య,విద్యోన్నతి పథకాలను పునరుద్ధరించాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలకు ఎక్కువ ప్రయోజనం చేకూరేలా పథక నిబంధనల్లో మార్పులు చేయాలని సూచించారు. 26 జిల్లాల్లో బీసీ భవనాల నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని, బీసీ స్టడీసర్కిళ్ల బలోపేతానికి రూ.10 కోట్లు విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే, వందమంది అభ్యర్థులతో ఐఏఎస్ స్టడీసర్కిల్ ఏర్పాటు చేయాలని సూచించారు.
56 బీసీ కార్పొరేషన్లను పునర్నిర్మాణం
బీసీ కార్పొరేషన్ల పునర్నిర్మాణం గురించి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 139 కులాలవారికి లబ్ధి అందేలా 56 బీసీ కార్పొరేషన్లను పునర్నిర్మించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్పొరేషన్ల ద్వారా బీసీల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, కులాలు మరియు ఉపకులాల ఆధారంగా ఉండాలని సూచించారు. నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.100 కోట్ల రాయితీ రుణాలు పొందేందుకు, రాష్ట్రం నుండి రూ.38 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. గురుకుల విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న డైట్ ఛార్జీలు,కాస్మొటిక్ ఛార్జీల చెల్లింపులు త్వరగా చేయాలని,వసతి గృహాల మరమ్మతులకు, విద్యార్థుల సామగ్రి కోసం సుమారు రూ.35 కోట్లు విడుదల చేయాలని సూచించారు.
అసంపూర్తిగా ఉన్న బీసీ భవనాల నిర్మాణానికి రూ.8 కోట్లు విడుదల
విద్యార్థుల నైపుణ్యాల మెరుగుదలకు శంకరన్ రిసోర్స్ సెంటర్ల తరహాలో ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, 2014-19 మధ్య ప్రారంభమైన,అసంపూర్తిగా ఉన్న బీసీ భవనాల నిర్మాణానికి రూ.8 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల్లోని బీపీఎల్ కుటుంబాల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2014-19 మధ్య మంజూరు చేసిన 68 కాపు భవనాల పూర్తి కోసం కూడా చర్యలు తీసుకోవాలని, ఇందులో పూర్తికాని రెండు భవనాల నిర్మాణానికి రూ.2.36 కోట్లు విడుదల చేయాలని సూచించారు.
ఆర్టీజీఎస్‌తో గురుకులాల అనుసంధానం: మంత్రి సవిత
రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని ఆర్టీజీఎస్‌తో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఆమె మంగళవారం సచివాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ''ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నాలుగు గురుకులాల భవనాల నిర్మాణం పూర్తిచేసేందుకు రూ.75 కోట్లు మంజూరు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాం. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ప్రత్యేక కార్యక్రమం చేపడతాం. బీసీ-ఏలోని అత్యంత వెనుకబడిన వర్గాలను సహాయపడేందుకు సీడ్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. అలాగే, చేతివృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ పథకాన్ని అమలు చేస్తాం'' అని మంత్రి వివరించారు.