జూన్ 20న 'ప్రపంచ దేశద్రోహుల దినోత్సవం'గా ప్రకటించాలి: సంజయ్ రౌత్
జూన్ 20ని 'ప్రపంచ దేశద్రోహుల దినోత్సవం'గా ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఐక్యరాజ్య సమితిని కోరారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు లేఖ రాశారు. సరిగ్గా గతేడాది ఇదే రోజున శినసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని 40మంది శివసేన ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ శిండే తిరుగుబాటు చేసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూలదోశారు. కేవలం 10రోజుల వ్యవధిలోనే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు చెల్లించి మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టినట్లు సంజయ్ ఆరోపించారు. జూన్ 21ని ప్రపంచ యోగ దినోత్సవంగా జరుపుకున్నట్లే, జూన్ 20ని ప్రపంచ ద్రోహుల దినోత్సవంగా నిర్వహించాలని సంజయ్ విజ్ఞప్తి చేశారు.
సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే జన్మదినమైన జులై 27ని 'దేశద్రోహుల దినం'గా ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇప్పటివరకు ఇప్పటివరకు చూసిన అతిపెద్ద దేశద్రోహి జులై 27న జన్మించినట్లు రాణా వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్టర్‌లో ఐక్యరాజ్య సమితి, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో పాటు ఇతరులను నితీష్ రాణే ట్యాగ్ చేశారు. అయితే నితీష్ రాణే ట్వీట్‌లో ఉద్ధవ్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు చేశారు. తన తండ్రిని ఉద్ధవ్ వెన్నుపోటు పరోక్ష ఆరోపణలు గుప్పించారు.