LOADING...
Thermal Power: మంచిర్యాల వద్ద మరో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్ కేంద్రం.. భెల్‌తో సింగరేణి ఒప్పందం
మంచిర్యాల వద్ద మరో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్ కేంద్రం.. భెల్‌తో సింగరేణి ఒప్పందం

Thermal Power: మంచిర్యాల వద్ద మరో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్ కేంద్రం.. భెల్‌తో సింగరేణి ఒప్పందం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2025
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో 800 మెగావాట్ల కొత్త థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి భెల్‌ (BHEL)తో సింగరేణి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం సింగరేణి భవన్‌లో జరిగింది, ఇందులో సింగరేణి సీఎండీ బలరాం, భెల్‌ జనరల్‌ మేనేజర్లు పార్థసారథి దాస్, జోగేష్‌ గులాటి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ, ఒప్పందం ప్రకారం ప్లాంట్‌ నిర్మాణం నాలుగేళ్లలో పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, 40 నెలల్లోనే పనులు ముగించాలని స్పష్టంచేశారు. దీనికనుగుణంగా వచ్చే నెల నుంచే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించాలని సూచించారు. ప్రస్తుతం 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర ప్రాంగణంలో అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

వివరాలు  

కీలక ఖనిజాల తవ్వకాల్లో ఎన్‌ఎండీసీతో భాగస్వామ్యం 

2016లో నిర్మాణం పూర్తయిన 1,200 మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్‌ విజయవంతంగా పనిచేస్తూ, కంపెనీకి ఏటా సుమారు రూ.450 కోట్ల లాభాలను అందించిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ ప్లాంట్‌ ద్వారా రాష్ట్రానికి సుమారు 70 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా చేశామని చెప్పారు. కొత్తగా నిర్మించనున్న 800 మెగావాట్ల ప్లాంట్‌ పూర్తయితే, సింగరేణికి ఏడాదికి అదనంగా రూ.300 కోట్ల వరకు లాభాలు రావచ్చని బలరాం తెలిపారు. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని,కీలక ఖనిజాల గనుల తవ్వకాల్లో అడుగుపెట్టాలని సింగరేణి నిర్ణయించిందని బలరాం తెలిపారు. ఖనిజ ఉత్పత్తిలో 60 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం కలిగిన జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)తో కలిసి పనిచేయనున్నట్లు పేర్కొన్నారు.

వివరాలు 

ఐఐటీ-హైదరాబాద్‌తో ఒప్పందం

ఈ విషయంలో ఎన్‌ఎండీసీ సీఎండీ అమితాబ్‌ ముఖర్జీ, ఆ సంస్థ డైరెక్టర్లతో కలిసి సింగరేణి అధికారులు ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. అంతేకాక, మైనింగ్‌లో మేథోపరమైన పరిజ్ఞానాన్ని విస్తరించేందుకు ఐఐటీ-హైదరాబాద్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బలరాం వెల్లడించారు. రాబోయే ప్రాజెక్టుల్లో సింగరేణిని సహ భాగస్వామిగా తీసుకునే అవకాశాలను పరిశీలిస్తామని ఎన్‌ఎండీసీ సీఎండీ అమితాబ్‌ ముఖర్జీ తెలిపారు.