Amaravathi: రాజధానిలో మరో రూ. 24,276 కోట్ల పనులకు ఆమోదం.. 3 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ. 24,276.83 కోట్ల విలువైన కొత్త పనులకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 43వ సీఆర్‌డీఏ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు అనుమతి లభించింది. ప్రధాన రహదారులు, ఎల్‌పీఎస్ లేఅవుట్‌లలో మౌలిక వసతుల కల్పనతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల నిర్మాణాలకు ఈ సమావేశంలో ఆమోదం ప్రకటించారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 45,249.24 కోట్ల పనులకు అనుమతులు లభించాయి. మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా టెండర్లు పిలుస్తామని, మొత్తం మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ. 62,000 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. టెండర్ల ప్రక్రియ మూడు రోజుల్లో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
అసెంబ్లీ భవనం కోసం 103 ఎకరాల స్థలం
అసెంబ్లీ భవనం కోసం 103 ఎకరాల స్థలంలో 11.22 లక్షల చదరపు అడుగుల నిర్మాణం జరగనుంది. 250 మీటర్ల ఎత్తుతో నిర్మించే ఈ భవనానికి రూ. 765 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అసెంబ్లీ సమావేశాలు ఏడాదిలో 40-50 రోజులే నిర్వహిస్తారు. మిగతా రోజుల్లో ప్రజలకు టవర్ పైకి వెళ్లి అమరావతి నగరాన్ని వీక్షించే అవకాశం కల్పిస్తారు.హైకోర్టు భవనాన్ని 42 ఎకరాల్లో,55 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్నారు. మొత్తం 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ భవనానికి రూ. 1,048 కోట్లు ఖర్చు అవుతుంది. సచివాలయం,విభాగాధిపతుల కార్యాలయాలు ఐదు ఐకానిక్ టవర్లుగా రూపుదిద్దుకోనున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం టవర్‌ను బేస్‌మెంట్+గ్రౌండ్+47 అంతస్తులుగా నిర్మించనున్నారు.
ఐదు ఎల్‌పీఎస్ జోన్లలో 90 ఎంఎల్‌డీ సామర్థ్యంగల మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు
ఇందులో మొత్తం నిర్మాణ విస్తీర్ణం 17,03,433 చదరపు అడుగులు కాగా, మొత్తం ఐదు టవర్లకు 68,88,064 చదరపు అడుగుల నిర్మాణం జరగనుంది. ఇందుకు రూ. 4,688 కోట్లు వ్యయం కానుంది. ఎల్‌పీఎస్ లేఅవుట్‌లలో 579.5 కి.మీ. పొడవైన రహదారుల నిర్మాణానికి రూ. 9,699 కోట్లు ఖర్చు అవుతుందని అథారిటీ వెల్లడించింది. ఇందులో 360 కి.మీ. ప్రధాన రహదారుల నిర్మాణం ఉండగా, 151.9 కి.మీ. రహదారుల పనులు రూ. 7,794 కోట్ల వ్యయంతో చేపడతారు. అదనంగా ఐదు ఎల్‌పీఎస్ జోన్లలో 90 ఎంఎల్‌డీ సామర్థ్యంగల మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు రూ. 318.15 కోట్లతో అనుమతి లభించింది.