రాజాసింగ్‌కు మరో షాక్.. గోషామహల్ సీటు వదులుకుంటేనే సస్పెన్షన్ ఎత్తివేత..?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బీజేపీ అదిష్టానం మరోసారి ఝలక్ ఇచ్చినట్లు సమాచారం. రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ అదిష్టానం ఇంతవరకూ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే రాజాసింగ్ సన్పెన్షన్‌పై జాప్యానికి ప్రధాన కారణాన్ని అదిష్టానం బయట పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన గోషామహల్ నియోజకవర్గ బరి నుండి తప్పుకుంటే సస్పెన్షన్ ఎత్తివేయనున్నట్లు సమాచారం. రాజాసింగ్ గోషామహల్ నుంచి కాకుండా 2024 సార్వత్రిక ఎన్నికలలో జహీరాబాద్ లోక్ సభ సెగ్మెంట్ నుండి పోటీ చేయాలని బీజేపీ అదిష్టానం ఒత్తిడి చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
స్వాతంత్య్ర అభ్యర్థిగా రాజాసింగ్..?
గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ మాజీ మంత్రి, దివంగత ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ను బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గోషామహల్ బరిలో నుంచి రాజాసింగ్ తప్పుకోవాలని అదిష్టానం సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అదిష్టానం నిర్ణయాన్ని రాజాసింగ్ అంగీకరించలేదని, గోషామహల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని రాజాసింగ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్ కి మంచి ఓటు బ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి కాకుండా వేరే స్థానంలో నిలబడితే కష్టమని అతని అనుచరులు చెబుతున్నారు.