రణరంగంగా మారిన మణిపూర్.. వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వైరల్
వరుస హింసాత్మక ఘటనలతో అల్లాడిపోతున్న మణిపూర్‌లో మరో భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో వైరల్‌గా మారడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. జులై 2న బిష్ణుపూర్ జిల్లాలో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘర్షణలో ఓ వర్గానికి చెందిన నలుగురిని మరో వర్గం వారు కిరాతకంగా హత్య చేశారు. డేవిడ్ థీక్ అనే వ్యక్తి తల నరికి అదే ఏరియాలో వెదురు కర్రలతో కూడిన కంచెకు అతడి తలను వేలాడదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
గత రెండు రోజులుగా ఉభయ సభల్లోనూ రాజకీయ దుమారం
మే4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో ఈ నెల 19న వైరల్ గా మారింది. హింసాకాండకు వ్యతిరేకంగా గురువారం మణిపూర్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. మహిళల అమానుష ఘటన దేశన్నే కుదిపేసింది. మరోవైపు గత రెండు రోజులుగా పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఈ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లోయలో ఉన్న అత్యధిక మైతీ వర్గం, పర్వత ప్రాంతంలోని గిరిజన కుకీల మధ్య మే నుంచి తీవ్ర స్థాయిలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటికే 160 మంది ప్రాణాలు విడిచారు. భారీ స్థాయిలో ఇళ్లు దగ్ధం కావడంతో వేలాదిగా ప్రజలు నిరాశ్రయిలయ్యారు. ఫలితంగా ప్రభుత్వ శిబిరాల్లోనే తాత్కాలిక నివాసం ఉంటున్నారు.