మహిళా బిల్లుకు మద్ధతుగా ఏపీ అసెంబ్లీ తీర్మానం.. ఒకే రోజు 10 బిల్లులకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు కీలకమైన బిల్లులను సభ ఆమోదించింది. ఈ మేరకు మహిళ సాధికారతపై చర్చించిన తర్వాత, మహిళ రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అనంతరం అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ, భూ సంస్కరణలపై చర్చ చేపట్టింది. ముందస్తు అజెండా మేరకు 9 బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉండగా అదనంగా మరో బిల్లు చేర్చి మొత్తం పది బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించింది. సోమవారం సమావేశాలను ప్రతిపక్ష తెలుగుదేశం సభ్యులు బహిష్కరించారు. ఈ క్రమంలోనే విపక్షం లేకుండానే మొత్తం 10 బిల్లులను శాసనసభ ఆమోదించింది. ఈ మేరకు సభ రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
మూడో రోజు 10 బిల్లులకు సభ ఆమోదం
1. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్ట సవరణ బిల్ 2. ఆంధ్రప్రదేశ్ ప్రయివేట్ యూనివర్శిటీల చట్టంలో సవరణ బిల్ 3. ఏపీ జీఎస్టీ చట్టంలో సవరణల బిల్లు 4. ఏపీఎస్ ఆర్టీసీ సవరణ బిల్లు 5.ఏపీ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ మొదటి సవరణ బిల్లు 6. ఏపీ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ రెండో సవరణ బిల్లు 7. ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్లు 8. ఆంధ్రప్రదేశ్ భూదాన్ అండ్ గ్రామ్ దాన్ సవరణ బిల్లు 9. ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక చట్టంలో సవరణ బిల్లు 10. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిమెంట్ రెగ్యులేషన్ యాక్ట్ లో సవరణ బిల్లు