ఉద్యోగులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. సీపీఎస్ స్థానంలో జీపీఎస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగుల సంక్షేమం కోసం కొత్త పెన్షన్ విధానాన్ని తేనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నూతన ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనను కేబినెట్ ఆమోదించింది. సీపీఎస్ ఉద్యోగుల కోసం ఏపీ జీపీఎస్ బిల్లు తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. "ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023" పేరిట రాష్ట్రంలో కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల కోసం క్రమబద్ధీకరణ చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రి వర్గం, 12వ పీఆర్సీ ఏర్పాటుకు సైతం అంగీకరించింది.
పౌరసరఫరాల శాఖకు రూ.5 వేల కోట్ల రుణ సేకరణకు పర్మిషన్
18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను బిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రి వర్గం. ఇందుకోసం దాదాపుగా రూ. 6, 888 కోట్లను ఖర్చు చేసేందుకు సర్కారు సిద్ధమైంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కనెక్షన్ కోసం రూ. 445 కోట్ల రుణాలు తీసుకువచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28న తల్లిదండ్రుల ఖాతాల్లో వేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నూతన వైద్యకళాశాలల్లో 706 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. చిత్తూరు డెయిరీ ప్లాంట్‌కు 28 ఎకరాల భూమిని లీజు రూపంలో ఇచ్చేందుకు అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.5 వేల కోట్ల రుణ సేకరణకు అనుమతించింది.